వాంఖెడే స్టేడియంలో టికెట్లు సంపాదించడం ఇకపై చాలా ఈజీ: ద్రావిడ్ సరదా వ్యాఖ్యలు

  • వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరిట ఓ స్టాండ్ ఏర్పాటు
  • ముంబయి, భారత క్రికెట్‌కు సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం
  • రాహుల్ ద్రావిడ్ నుంచి హిట్‌మ్యాన్‌కు అభినందనలు
  • ఇక టికెట్ల కోసం ఎవరిని అడగాలో తెలుసన్న ద్రవిడ్
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు, 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ముంబయిలోని ప్రఖ్యాత వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు అతడి పేరును పెట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు రోహిత్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా రోహిత్‌ను ప్రశంసిస్తూ, ఓ సరదా వ్యాఖ్య చేశాడు.

రోహిత్ శర్మ క్రికెట్‌లో సాధించిన విజయాలకు, ముఖ్యంగా ముంబయి జట్టుకు, భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించిందని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. "హేయ్ రోహిత్, వాంఖడేలోని ఈ స్టాండ్లలోకి నువ్వు ఎన్నో సిక్స్‌లు బాదావు. అందుకే ఈ రోజు నీ పేరు మీద ఒక స్టాండ్ వచ్చింది. నువ్వు దీనికి పూర్తిగా అర్హుడివి. నీకు, నీ కుటుంబ సభ్యులకు ఇది చాలా అద్భుతమైన క్షణం. ఇదే మైదానంలో మళ్లీ మళ్లీ ఆడుతూ, రోహిత్ శర్మ స్టాండ్‌లోకి మరిన్ని సిక్స్‌లు కొట్టాలని కోరుకుంటున్నాను" అని ద్రావిడ్ తన సందేశంలో తెలిపాడు.

అంతేకాకుండా, ద్రావిడ్ ఓ చమత్కారమైన వ్యాఖ్య కూడా చేశారు. "ముంబయి స్టేడియంలో ఎప్పుడైనా నాకు టికెట్లు కావాల్సి వస్తే, ఇక ఎవరిని అడగాలో ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుసు" అంటూ నవ్వేశారు. ఈ వీడియోను ముంబయి ఇండియన్స్ జట్టు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.

శుక్రవారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ స్టాండ్‌ను అధికారికంగా ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో రోహిత్ శర్మ తల్లిదండ్రులు గురునాథ్‌శర్మ, పూర్ణిమ ఈ స్టాండ్‌ను ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఇది తాను కలలో కూడా ఊహించని గొప్ప గౌరవమని, ఇకపై ఇదే మైదానంలో మ్యాచ్‌లు ఆడుతుంటే మరింత ప్రత్యేకంగా అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.


More Telugu News