‘అరే బిడ్డా కేటీఆర్.. నీకంటే మాకే అనుభవం ఎక్కువ’: కడియం శ్రీహరి నిప్పులు
- కేటీఆర్‌కు అహంకారం ముదిరిందన్న కడియం శ్రీహరి
- తాము ఆడవాళ్లమో, మగవాళ్లమో తెలుసుకోవాలంటే స్టేషన్ ఘన్‌పూర్‌కు రావాలని హితవు
- రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామన్న ఎమ్మెల్యే
తనను, పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వాడిన పదజాలంపై కడియం తీవ్రంగా స్పందించారు. "మేము ఆడవాళ్లమో, మగవాళ్లమో తెలుసుకోవాలంటే స్టేషన్ ఘన్‌పూర్‌కు వచ్చి చూడు బిడ్డా.. ఇక్కడ 143 సర్పంచ్ స్థానాల్లో 100 మందిని గెలిపించుకున్నాం. మీ నాయన కేసీఆర్ కంటే నేను, పోచారం వయసులో రెండేళ్లు పెద్దవారం. నీకంటే మాకు రాజకీయ అనుభవం ఎక్కువ. మీ నాయన పదేళ్లు సీఎం చేస్తే.. నేను 14 ఏళ్లు మంత్రిగా పనిచేశా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించా. అరే బిడ్డా.. గుర్తుంచుకో, నీకంటే మాకే ఎక్కువ రాజ్యాంగబద్ధమైన అనుభవం ఉంది" అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే తాము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. "గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నందునే నియోజకవర్గానికి రూ.1400 కోట్ల నిధులు వచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. అప్పుడు ఎవరైనా అనర్హతకు గురయ్యారా?" అని ప్రశ్నించారు. కేవలం నియోజకవర్గ ప్రయోజనాల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై కూడా కడియం సెటైర్లు వేశారు. అభివృద్ధిని విస్మరించడం వల్లే ప్రజలు రాజయ్యకు రాజకీయ సమాధి కట్టారని ఎద్దేవా చేశారు. ఇక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ తన ఫోటోలను ఫ్లెక్సీలలో వాడుకుంటున్నారని, తన ముఖం చూస్తేనే ఓట్లు పడతాయని వారికి అర్థమైందని చురకలు అంటించారు.