Revanth Reddy: వీడియో సాక్ష్యాలతో కేసీఆర్‌ను కడిగేసిన రేవంత్ రెడ్డి!

Revanth Reddy Exposes KCR on Telangana Water Diversion with Video Evidence
  • కేసీఆర్.. చంద్రబాబు శిష్యుడు కాబట్టే తెలంగాణకు జల ద్రోహం చేశారన్న రేవంత్
  • గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటల వీడియోను ప్రదర్శించిన సీఎం
  • కేసీఆర్ సభలు పెట్టే చోటల్లా ఈ వీడియోను ప్రదర్శిస్తామని హెచ్చరిక
గత పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ జల ప్రయోజనాలను పొరుగు రాష్ట్రానికి ఎలా ధారాదత్తం చేశారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. ఆదివారం విలేకరుల సమావేశంలో తన మొబైల్ ఫోన్‌లో పాత వీడియోలను ప్రదర్శించారు. అందులో కేసీఆర్ మాట్లాడుతూ.. "తెలంగాణ భూభాగం ఎత్తులో ఉంది, నీటిని ఎత్తిపోయడం ఖర్చుతో కూడుకున్న పని.. కాబట్టి ఏపీ సోదరులే ఆ నీటిని వాడుకోవాలి" అని కేసీఆర్ చెప్పడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రశ్నించారు. ఇచ్చాపురం నుంచి శ్రీకాళహస్తి వరకు బరాజ్‌లు కట్టుకోవాలని చంద్రబాబుకు సలహా ఇచ్చింది కేసీఆరేనని, పట్టిసీమ ప్రాజెక్టును గొప్పగా పొగిడింది కూడా ఆయనేనని రేవంత్ ఆరోపించారు.

"పోతిరెడ్డిపాడు నుంచి 10 టీఎంసీల నీటిని తరలించుకోమని చెప్పి.. మన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని మాత్రం 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి కుదించిన ఘనత కేసీఆర్‌దే" అని మండిపడ్డారు. కేసీఆర్ బహిరంగ సభలు పెట్టే చోటల్లా ఆయన ఏపీ ప్రాజెక్టులను సమర్థిస్తూ మాట్లాడిన ఈ వీడియోలను ప్రదర్శిస్తామని హెచ్చరించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో బీఆర్ఎస్‌కు రహస్య సయోధ్య కుదిరిందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. "కాళేశ్వరం విఫలమై ఇన్ని రోజులవుతున్నా సీబీఐ విచారణకు కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అధికారుల విచారణకు అడ్డంకులు ఎందుకు సృష్టిస్తోంది? దీన్ని బట్టే కేసీఆర్‌కు, కేంద్రానికి మధ్య ఉన్న దోస్తీ అర్థమవుతోంది" అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజకీయంగా చంద్రబాబు శిష్యుడేనని, అందుకే ఆయనకు మేలు చేసేలా గోదావరి నీటిని వాడుకోమని చెప్పారని విమర్శించారు.

బీఆర్ఎస్ నాయకత్వంపై రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. కేసీఆర్, కేటీఆర్ మధ్య కనీస ఏకాభిప్రాయం లేదని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి పరిశ్రమల తరలింపుపై తండ్రి ఒక మాట చెబితే, కొడుకు మరో మాట మాట్లాడుతున్నారని.. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తికి కనీస అవగాహన లేకుండా పోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని, కావాలంటే దీనిపై నిజనిర్ధారణ కమిటీని వేయడానికి సిద్ధమని సీఎం పేర్కొన్నారు.
Revanth Reddy
KCR
Telangana
Andhra Pradesh
Water Projects
Kaleshwaram Project
Pattiseema Project
BRS BJP alliance
Telangana Politics
AP Reorganisation Act

More Telugu News