‘ఆపరేషన్ సిందూర్‌’పై వ్యాఖ్య‌లు.. పాకిస్థానీ న‌టుల‌పై బ్యాన్‌కు భారతీయ సినీ సంఘం పిలుపు

  • ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత కొందరు పాక్‌ న‌టులు భార‌త సైన్యం చేసిన దాడిని త‌ప్పుబ‌డుతూ పోస్టులు
  • ముఖ్యంగా పాక్‌ నటులైన‌ ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ ఈ ఆప‌రేష‌న్‌పై విమ‌ర్శ‌లు
  • వారి వ్యాఖ్యలు దేశ వ్యతిరేకంగా ఉన్నాయని ఏఐసీడ‌బ్ల్యూఏ ఆగ్ర‌హం
  • పాకిస్థానీ కళాకారులను గుడ్డిగా సమర్థించడం సరికాదని హితవు
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి భారత సైన్యం ఇటీవ‌ల‌ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తర్వాత కొందరు పాకిస్థానీ న‌టీన‌టులు ఇండియ‌న్‌ ఆర్మీ చేసిన దాడిని త‌ప్పుబ‌డుతూ పోస్టులు పెట్టారు. 

ముఖ్యంగా పాకిస్థానీ నటులైన‌ ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ ఆప‌రేష‌న్ సిందూర్‌పై స్పందిస్తూ.. మహీరా ఖాన్ భారత సైన్యం చర్యను ‘పిరికి చర్య’ అని అభివర్ణించగా, ఫవాద్ ఖాన్ ఉగ్రవాదాన్ని ఖండించకుండా భారతదేశ వైఖరిని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆల్ ఇండియా సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ (AICWA) ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి వ్యాఖ్యలు దేశానికి, ఉగ్రవాదానికి బలైన అమాయక ప్రజలకు, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు అవమానకరమని పేర్కొంది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ పాకిస్థానీ కళాకారులను గుడ్డిగా సమర్థించడాన్ని మానుకోవాలని ఏఐసీడ‌బ్ల్యూఏ కోరింది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిని, కళ పేరుతో ప్రోత్సహించడం జాతీయ గౌర‌వాన్ని అవమానించడమేనని అభిప్రాయపడింది. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ తమ దేశానికి మద్దతు తెలుపుతున్న పాకిస్థానీ కళాకారులకు భారతీయ కళాకారులు మద్దతు ఇవ్వడం సరికాదని హితవు పలికింది. 

భారతీయ కళాకారులు ఎవ‌రూ కూడా పాకిస్థానీ న‌టుల‌తో కలిసి పనిచేయకూడదని, ఏ అంతర్జాతీయ వేదికను వారితో పంచుకోకూడదని స్పష్టం చేసింది. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిల‌బ‌డ‌దామ‌ని ఏఐసీడ‌బ్ల్యూఏ కోరింది. ఇప్పటికే పాకిస్థానీ కళాకారులు, నిర్మాతలు, ఫైనాన్షియర్లపై ఏఐసీడ‌బ్ల్యూఏ పూర్తి నిషేధం విధించింది. 

కాగా, గతంలో కూడా ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించాలని డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఈ డిమాండ్లు మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇతర సంఘాలు, ప్రముఖుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. అయితే, ఏఐసీడ‌బ్ల్యూఏ మాత్రం తమ డిమాండ్‌ను గట్టిగానే వినిపిస్తోంది.


More Telugu News