Shafali Verma: మూడో టీ20లో ఆడుతూ పాడుతూ కొట్టేశారు... సిరీస్ భారత్ కైవసం

India Women Clinch T20 Series Victory Over Sri Lanka Led by Shafali Verma
  • మూడో టీ20లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచిన భారత మహిళల జట్టు
  • నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించిన పేసర్ రేణుక సింగ్
  • మూడు వికెట్లు పడగొట్టి రాణించిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ
  • కేవలం 42 బంతుల్లో 79 పరుగులతో అజేయంగా నిలిచిన షఫాలీ వర్మ
  • 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్
తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో రేణుక సింగ్, బ్యాటింగ్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుత ప్రదర్శనతో టీమిండియా అలవోకగా గెలుపొందింది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు పేసర్ రేణుక సింగ్ (4/21) అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. తన పదునైన బంతులతో లంక బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చింది. మరోవైపు, స్పిన్నర్ దీప్తి శర్మ (3/18) కూడా కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులకే పరిమితమైంది. లంక జట్టులో ఇమేషా దులని (27), హసిని పెరీరా (25) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు.

అనంతరం 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే స్మృతి మంధాన (1), జెమీమా రోడ్రిగ్స్ (9) వికెట్లను కోల్పోయింది. అయితే, ఓపెనర్ షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 79 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (21 నాటౌట్) చక్కటి సహకారం అందించింది. దీంతో భారత జట్టు 13.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


Shafali Verma
India Women vs Sri Lanka Women
Renuka Singh
Harmanpreet Kaur
Deepti Sharma
Indian Women's Cricket Team
Sri Lanka Women's Cricket Team
Women's T20 Series
Cricket
Trivandrum

More Telugu News