Gadi Renuka: ఐటీ జాబ్ వదిలేసి గంజాయి రవాణా... బీటెక్ యువతి అరెస్ట్

Gadi Renuka Techie turned Ganja Smuggler Arrested in Anakapalle
  • అనకాపల్లి జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్
  • నిందితుల్లో ఒకరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసిన బీటెక్ యువతి రేణుక
  • ఏడుగురి నుంచి 74 కిలోల గంజాయి, వాహనాలు స్వాధీనం
  • స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 33 లక్షలు ఉంటుందని అంచనా
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి రవాణా చేస్తున్న ఓ బీటెక్ యువతితో పాటు ఏడుగురు సభ్యుల ముఠాను అనకాపల్లి జిల్లా నాతవరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 74 కిలోల గంజాయి, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం మీడియాకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ సుమారు రూ. 33 లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా మాడుగులపేటకు చెందిన గాది రేణుక బీటెక్ చదివి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసింది. అయితే, ఆ ఉద్యోగం మానేసి సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి రవాణా మార్గాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన సూర్య కాళిదాసు మదన్ కుమార్, ముత్తుతో పాటు స్థానిక ప్రాంతాలకు చెందిన పడ్డూరి ప్రసాద్, అండెంగుల రవికుమార్, లలిత కుమారి, పొన్నగంటి మణికుమారితో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది.

నిందితులు గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో నాతవరం పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కేసుపై నాతవరం ఎస్సై తారకేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Gadi Renuka
Anakapalle
ganja smuggling
IT job
Nathavaram police
narcotics case
Visakhapatnam
Andhra Pradesh crime
ganja racket
drug trafficking

More Telugu News