Sajjanar: న్యూఇయర్ పేరుతో అలా చేస్తే పబ్‌లు, రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు: సజ్జనార్ హెచ్చరిక

Sajjanar warns pubs restaurants on New Year rules license cancellation
  • కొత్త సంవత్సరం వేళ 'జీరో డ్రగ్స్' లక్ష్యమన్న సజ్జనార్
  • పబ్‌లు,  రెస్టారెంట్లు కచ్చితంగా రాత్రి 1 గంటకు మూసివేయాలని స్పష్టీకరణ
  • డ్రగ్స్ కేసుల్లోని నిందితులపై నిఘా ఉంచినట్లు తెలిపిన సజ్జనార్
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంటకు కచ్చితంగా మూసివేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాటి లైసెన్సులు రద్దు చేస్తామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. నగరంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌‌లో ఆయన హెచ్‌-న్యూ, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, వెస్ట్‌జోన్‌, సీసీఎస్‌ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'జీరో డ్రగ్స్‌' విధానమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపట్టాలని ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో డ్రగ్స్ వినియోగాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ రోజు నుంచే నగరంలోని పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించినట్లు తెలిపారు. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీల పైనా నిఘా ఉంటుందన్నారు.

గత రెండేళ్లలో డ్రగ్స్‌ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి కదలికలను నిశితంగా గమనిస్తున్నామని సజ్జనార్ వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు, వాటికి అలవాటుపడిన వారి జాబితా సిద్ధం చేసి వారిపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించినట్లు తెలిపారు. నగరానికి కొత్తగా వచ్చేవారి వివరాలను కూడా ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. మైత్రివనం, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, కేబీఆర్ పార్కు వంటి రద్దీ ప్రాంతాల్లో పటిష్టమైన చెక్ పోస్టులు, బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ వేడుకలపై కూడా నిఘా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. పోలీసులు అందరూ సమన్వయంతో పనిచేసి నగర పోలీసు ప్రతిష్ఠను పెంచాలని సూచించారు.
Sajjanar
Hyderabad police
New Year celebrations
Drug control
Pubs
Restaurants
License cancellation

More Telugu News