Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే కేటీఆర్‌ గడ్డం పెంచుతున్నారట.. బీజేపీ ఎంపీ అర్వింద్‌ సెటైర్లు!

Dharmapuri Arvind satires KTR for growing beard to become Chief Minister
Advertisement
  • గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి అవుతారని ఎవరో చెప్పడంతోనే కేటీఆర్‌ అలా చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు
  • గతంలో కేసీఆర్‌ పాత సచివాలయానికి వెళ్తే ఓడిపోతారని ఎవరో చెప్పడంతో కొత్త సచివాలయం నిర్మించారని వ్యాఖ్య
  • కేటీఆర్‌ గడ్డం పెరుగుతుందేమో కానీ సీఎం మాత్రం కాలేరంటూ అర్వింద్‌ ఎద్దేవా
  • 2028లో తెలంగాణలో కాషాయ సునామీ ఖాయమన్న అర్వింద్‌
  • రేవంత్‌రెడ్డిపై హైకమాండ్‌ అసంతృప్తిగా ఉందని వ్యాఖ్య
Advertisement
తెలంగాణలో బీజేపీ మౌనంగా ఉందన్న ప్రచారాన్ని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తోసిపుచ్చారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ సునామీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపు కోసం తెరవెనుక పనులు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే విజయం సాధిస్తామని అన్నారు. గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతలు పరస్పరం కాపాడుకుంటున్నారని అర్వింద్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీఎం రేవంత్‌రెడ్డిపై అసంతృప్తితో ఉందని, బీఆర్ఎస్‌తో పొత్తు ద్వారా ఆయనను పదవి నుంచి తప్పించే ఆలోచనలో ఉందని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్‌ పాలనలో అవినీతికి వేదికగా మారిందని అర్వింద్‌ విమర్శించారు. గతంలో లక్షల కోట్లు దోచుకున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్‌కు ప్రజలు మళ్లీ ఎందుకు ఓటేస్తారని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో పెయిడ్‌ ప్రచారాలు చేయించుకుంటూ ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు.

త్వరలో పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్‌ మీడియా వేదికలపై బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పారు. తమ ప్రశ్నలకు బీఆర్ఎస్‌ సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదని, ఆ పార్టీనే కనుమరుగవుతుందని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గడ్డం పెంచడంపైనా అర్వింద్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి అవుతారని ఎవరో చెప్పడంతోనే కేటీఆర్‌ అలా చేస్తున్నారేమోనని సెటైర్‌ వేశారు.

గతంలో కేసీఆర్‌ పాత సచివాలయానికి వెళ్తే ఓడిపోతారని ఎవరో చెప్పడంతో కొత్త సచివాలయం నిర్మించారని, అయినా ఎన్నికల్లో గెలవలేకపోయారని అన్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశతో గడ్డం పెంచుకోవడం కేటీఆర్‌తోనే మొదలుకాలేదని, గతంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా గడ్డం పెంచారని గుర్తుచేశారు. ఆయన గడ్డం పెరిగిందే తప్ప కాంగ్రెస్‌ పార్టీ బలపడలేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ గడ్డం పెరుగుతుందేమో కానీ సీఎం మాత్రం కాలేరంటూ అర్వింద్‌ ఎద్దేవా చేశారు.
Advertisement
Advertisement
Dharmapuri Arvind
KTR
BJP Telangana
BRS Party
Telangana Politics
2028 Assembly Elections

More Telugu News