హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రహస్యాల లీక్‌.. ఇద్దరు కీలక అధికారులపై విచారణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రహస్యాల లీక్‌.. ఇద్దరు కీలక అధికారులపై విచారణ!

HDFC Bank internal investigation on two senior officials for data leak
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఇద్దరు సీనియర్‌ అధికారులపై విచారణ
  • రహస్య వ్యాపార సమాచారం బయటకు చేరవేసినట్లు అనుమానాలు
  • సమాచారం దుర్వినియోగంపై కొనసాగుతోన్న దర్యాప్తు
  • విచారణ వివరాలను ఉన్నతాధికారులకు ఇప్పటికే వెల్లడి
  • విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని బ్యాంకు ప్రకటన
దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కీలక సమాచారం బయటకు వెళ్లినట్లు అంతర్గత విచారణలో వెల్లడైంది. బ్యాంకుకు చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులు వ్యాపార వ్యూహాలు, మార్కెట్‌పై ప్రభావం చూపగల సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేసినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై విచారణ ఇంకా కొనసాగుతోంది.

బ్యాంకులోని కొన్ని కీలక విభాగాలకు బాధ్యత వహిస్తున్న ఈ అధికారులపై అనుమానాలు రావడంతో అంతర్గత విచారణ ప్రారంభించారు. సమాచారం దుర్వినియోగమైందా? దాని వల్ల బ్యాంకుకు లేదా మార్కెట్‌కు ఏమైనా నష్టం జరిగిందా? అనే అంశాలపై పరిశీలిస్తున్నారు. విచారణలో గుర్తించిన విషయాలను ఉన్నతాధికారులతో పాటు బోర్డులోని కొందరు సభ్యులకు ఈ ఏడాది ప్రారంభంలోనే తెలియజేసినట్లు సమాచారం. సంబంధిత అధికారులకు కూడా విచారణ వివరాలు అధికారికంగా తెలిపినట్లు తెలుస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధి అంతర్గత విచారణ జరుగుతున్న విషయాన్ని ధ్రువీకరించారు. అయితే, విచారణలో వెల్లడైన అంశాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వివరాలపై స్పందించలేదు. విచారణ పూర్తయ్యాక వెల్లడయ్యే అంశాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నైతిక విలువలు, పాలనా ప్రమాణాల విషయంలో రాజీ పడబోమని బ్యాంకు స్పష్టం చేసింది.

ఈ పరిణామం బ్యాంకుకు కీలకమైన సమయంలో చోటుచేసుకుంది. ఈ నెల 27న అనూప్‌ బాగ్చీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రత్యర్థి ఐసీఐసీఐ గ్రూపులో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు ఈ పరిణామాలు సవాలుగా మారే అవకాశముంది.

ఇటీవల బ్యాంకులో ఉన్నతస్థాయి మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. మార్చిలో అప్పటి ఛైర్మన్‌ చక్రవర్తి వ్యక్తిగత విలువలకు, బ్యాంకులోని కొన్ని విధానాలకు మధ్య విభేదాలున్నాయని పేర్కొంటూ రాజీనామా చేశారు. అయితే, ఆందోళనలకు ఆధారాలు లేవని బ్యాంకు నియమించిన స్వతంత్ర న్యాయ సమీక్ష తెలిపింది. ప్రస్తుత సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ మరోసారి పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపలేదు. డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కైజాద్‌ భరూచా కూడా డిసెంబరు చివర్లో వైదొలగాలని నిర్ణయించుకున్నారు.
Advertisement
HDFC Bank
Internal Investigation
Data Leak
Senior Officials
Anup Bagchi
Banking Sector News

More Telugu News