Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రీల్ పిచ్చి.. అలల్లో కొట్టుకుపోతున్న బిడ్డ.. పట్టించుకోని తల్లిదండ్రులు!

Advertisement
  • సోషల్ మీడియా రీల్ కోసం ఓ జంట కన్నబిడ్డను పట్టించుకోని వైనం
  • సముద్రపు అలల్లో చిన్నారి కొట్టుకుపోతున్నా చిత్రీకరణ ఆపలేదు
  • గమనించి చిన్నారిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించిన ఓ అపరిచితుడు 
  • ఈ వీడియో వైరల్ కావడంతో ఆ జంటపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం
Advertisement
సోషల్ మీడియా మోజులో పడి కొందరు కనీస బాధ్యతలను కూడా విస్మరిస్తున్నారు. తాజాగా ఓ జంట తమ కన్నబిడ్డ ప్రాణాల కంటే సోషల్ మీడియా రీల్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. సముద్ర తీరంలో చిన్నారి అలల తాకిడికి ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా రీల్ వీడియో చిత్రీకరణలో మునిగిపోయిన తల్లిదండ్రుల నిర్లక్ష్యం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
ఓ జంట తమ చిన్నారితో కలిసి సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ వారు తమ ఫోన్ లేదా సెల్ఫీ స్టిక్‌తో రీల్ వీడియో తీయడం ప్రారంభించారు. మొదట తల్లి, చిన్నారి చేతులు పట్టుకుని నడిపించినా, ఆ తర్వాత వారు కెమెరాకు పోజులివ్వడంలో నిమగ్నమయ్యారు. 

ఈ క్రమంలో అదుపుతప్పిన చిన్నారి సముద్రపు అలల తాకిడికి కిందపడిపోయింది. అలలు బలంగా కొడుతుండటంతో ఆ చిన్నారి లేవడానికి ఇబ్బంది పడుతున్నా, తల్లిదండ్రులు మాత్రం తమ చిత్రీకరణను కొనసాగించారు.

అక్కడే ఉన్న ఓ అపరిచితుడు ఈ విషయాన్ని గమనించి వెంటనే స్పందించాడు. నీళ్లలో ఇబ్బంది పడుతున్న చిన్నారి వద్దకు వెళ్లి, చేయి పట్టుకుని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిచి చిన్నారిని వారికి అప్పగించాడు. ఈ ఘటనను చూశానని పేర్కొంటూ ఓ 'ఎక్స్' (ట్విట్టర్) వినియోగదారుడు ఈ వీడియోను షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ జంటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "సోషల్ మీడియా పిచ్చిలో పడి కన్నబిడ్డ ప్రాణాలను కూడా పట్టించుకోరా?" అంటూ మండిపడుతున్నారు. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అయితే, ఈ ఘటన ఎక్కడ? ఎప్పుడు జరిగింది? వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కొందరు ఈ వీడియో ప్రామాణికతను కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన సోషల్ మీడియా వ్యసనం మానవ సంబంధాలపై, ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యతలపై చూపిస్తున్న ప్రభావాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement

More Telugu News