Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏలూరు జిల్లా మహిళ ముంతాజ్ స్ఫూర్తి గాథ.. ఆమె సేమియాలు దుబాయ్, అమెరికాకు!

Mohammad Mumtaz Begum success story Eluru woman exporting semiya to Dubai and USA
Advertisement
  • విజయవాడలో కొన్న సేమియా ప్యాకెట్‌తో వచ్చిన ఆలోచన
  • రూ.2 లక్షల బ్యాంకు రుణంతో ఇంట్లోనే తయారీ యూనిట్ ఏర్పాటు
  • రంజాన్ సమయంలో భారీ డిమాండ్.. విదేశాలకు సైతం ఎగుమతి
  • ఏడుగురికి పైగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మహిళ
Advertisement
రెండేళ్ల క్రితం విజయవాడలో కొన్న ఒక సేమియా ప్యాకెట్.. ఓ సాధారణ గృహిణి జీవితాన్నే మార్చేసింది. చిన్న ఆలోచనతో మొదలైన ఆమె ప్రస్థానం, ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన మహమ్మద్ ముంతాజ్ బేగం, సేమియా తయారీ వ్యాపారంలో విజయవంతమై ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, రెండేళ్ల క్రితం విజయవాడలో సేమియా కొనుగోలు చేసినప్పుడు, వాటిని స్థానికంగా ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన ముంతాజ్‌కు వచ్చింది. వెంటనే ఆ దిశగా అడుగులు వేశారు. ఏలూరులోని చైతన్య గోదావరి బ్యాంకు మేనేజర్ మార్గదర్శకత్వంతో రూ.2 లక్షల బ్యాంకు రుణం తీసుకుని, సేమియా తయారీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. గోధుమ పిండి, శుద్ధి చేసిన నీటిని ఉపయోగించి తన ఇంట్లోనే ఉత్పత్తి ప్రారంభించారు. ఈ యంత్రం ఒకేసారి 15 కిలోల సేమియాను ఉత్పత్తి చేస్తుంది. వాటిని ఎండబెట్టి, ఆకర్షణీయంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు.

ముఖ్యంగా రంజాన్ పండుగ సమయంలో వీరి సేమియాలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పండుగ సందర్భంగా పంపిణీ చేసేందుకు ఏకంగా రూ.1 లక్ష విలువైన 1,500 ప్యాకెట్లను ఆర్డర్ చేయడం ఆమె వ్యాపారానికి మరింత ఊపునిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు దుబాయ్, అమెరికా, మలేషియా వంటి దేశాల్లోని వారికి కూడా సేమియాలను పంపిస్తున్నారు.

ముంతాజ్ విజయం కేవలం ఆమెకే పరిమితం కాలేదు. తన యూనిట్‌లో ఏడుగురికి పైగా స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. పండుగ సీజన్‌లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కార్మికులకు రోజుకు రూ.500 వరకు వేతనం చెల్లిస్తున్నారు. ఆమె భర్త, చిన్న కుమారుడు వ్యాపారంలో సహాయం చేస్తుండగా, పెద్ద కుమారుడు దుబాయ్‌లో పనిచేస్తున్నారు. తనకు ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు, ఇతరులు ఖరీదైన యంత్రాలు కొనాల్సిన అవసరం లేకుండా తన యంత్రాన్ని అద్దెకు ఇవ్వడం ఆమె సేవా దృక్పథానికి నిదర్శనం.

భవిష్యత్తులో రవాణా, మార్కెటింగ్ సౌకర్యాల కోసం తన యూనిట్‌ను హనుమాన్ జంక్షన్‌కు మార్చాలని ముంతాజ్ యోచిస్తున్నారు. తనలాంటి స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రభుత్వ ప్రదర్శనలు, మేళాలలో అవకాశం కల్పించాలని ఆమె కోరుతున్నారు.
Advertisement
Advertisement
Mohammad Mumtaz Begum
Eluru woman entrepreneur
Semiya manufacturing business
Andhra Pradesh success story
Chintamaneni Prabhakar
Women empowerment AP

More Telugu News