ఏబీవీ వెనుక టీడీపీ లేదు.. ఉనికి కోసమే విజయసాయి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: కేశినేని చిన్ని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏబీవీ వెనుక టీడీపీ లేదు.. ఉనికి కోసమే విజయసాయి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: కేశినేని చిన్ని

Kesineni Chinni slams Vijayasai Reddy over false allegations on TDP and AB Venkateswara Rao
  • విజయవాడ మేయర్ ఎన్నికలపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ చిన్ని
  • ఏబీ వెంకటేశ్వరరావు వెనుక టీడీపీ ఉందనడం అవాస్తవమని స్పష్టీకరణ
  • కూటమి ఐక్యతను దెబ్బతీయడానికే సాయిరెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపణ
  • వంగవీటి రాధాను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేసిన చిన్ని
విజయసాయిరెడ్డి తన రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నారని, అందులో భాగంగానే తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. విజయవాడ మేయర్ ఎన్నికల నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని, ఆయన కుట్రలు ఫలించవని స్పష్టం చేశారు.

విజయవాడ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రచారాన్ని కేశినేని చిన్ని కొట్టిపారేశారు. ఏబీ వెంకటేశ్వరరావుకు, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. "ఏబీ వెంకటేశ్వరరావు ఒక రిటైర్డ్ అధికారి. ఆయన వ్యక్తిగత హోదాలో పోటీ చేస్తుంటే, దాన్ని తెలుగుదేశానికి ఆపాదించడం కేవలం కుట్రలో భాగమే. ఇలాంటి పన్నాగాలు, కుతంత్రాలు చేయాల్సిన అవసరం టీడీపీకి లేదు" అని చిన్ని అన్నారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాల ద్వారా ఎన్డీయే కూటమి పార్టీల మధ్య ఐక్యతను దెబ్బతీయాలనేది విజయసాయిరెడ్డి దురుద్దేశమని ఆయన ఆరోపించారు. 2014-19 మధ్య కాలంలో బీజేపీ నుంచి టీడీపీని దూరం చేయడానికి అనేక కుట్రలు చేశానని స్వయంగా విజయసాయిరెడ్డే చెప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చిన్ని గుర్తుచేశారు. "ఈసారి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూటమిని విడగొట్టలేరు, మా ఐక్యతను చెడగొట్టలేరు. రాష్ట్ర ప్రజలు ఏ1 మాటలు నమ్మడానికి గానీ, ఏ2 మాటలు వినడానికి గానీ సిద్ధంగా లేరు" అని వ్యాఖ్యానించారు.

విజయసాయిరెడ్డి ఎంత బురద జల్లినా కూటమి కలిసే ఉంటుందని, అందరూ కలిసికట్టుగా విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయాలతో విజయసాయిరెడ్డి వంటి వారి నోళ్లు మూయిస్తామని ఆయన అన్నారు.

ఇంతకీ విజయసాయి ఏమన్నారంటే..!

స్థానిక ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతు పలకడం సిగ్గులేని రాజకీయమని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

"ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత సిగ్గుమాలిన స్థితికి దిగజారాయో చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ "కాక్రోచ్‌ పార్టీ"తో కలిసి పని చేస్తోంది. ఆ కాంగ్రెస్‌ పెట్టిన ‘ఇండి’ కూటమిలోనే సీపీఐ, సీపీఎం కూడా భాగస్వాములుగా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, అదే కాక్రోచ్‌కు ఇప్పుడు వైసీపీ కూడా బేషరతుగా మద్దతు ప్రకటించింది. మేం వైసీపీతో కలిసి పని చేస్తున్నామని స్వయంగా సీపీఐ ప్రకటించడమే దీనికి నిదర్శనం.

మరోవైపు, జీవితంలో జగన్‌ను మళ్లీ సీఎం కాకుండా చూడటమే తన ఏకైక లక్ష్యమని, 'జగన్‌ నెవర్‌ ఎగైన్‌' అని ఏబీ వెంకటేశ్వరరావు శపథం చేశారు. గత రెండేళ్లుగా ఆయన కేవలం "రెడ్డి" పారిశ్రామికవేత్తలనే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మార్కు దుర్మార్గపు రాజకీయం. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాను జనసేనలోకి పంపేసి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీవీని ఇండిపెండెంట్‌గా పోటీ చేయించడం ఆయనకే చెల్లింది.

ఇప్పుడు అదే ఏబీవీకి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఒకవైపు జగన్‌ను సీఎం కానివ్వనని చెప్పే వ్యక్తికి, మరోవైపు వైయస్సార్‌సీపీతో కలిసి పనిచేస్తున్నామని చెప్పే పార్టీలు మద్దతివ్వడం ఎంతటి విడ్డూరం? ఇంత సిగ్గు లేని రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకెంత కాలం భరించాలి? ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన సమయం" అని విజయసాయి పేర్కొన్నారు.
Advertisement
Kesineni Chinni
Vijayasai Reddy
AB Venkateswara Rao
Vijayawada Mayor Elections
TDP YSRCP Political War
Vangaveeti Radha

More Telugu News