Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాలూరులో విచిత్ర రాజకీయం.. జనసైనికులకు ఊహించని షాక్..!

Saluru strange politics unexpected shock to Janasainiks over chairperson ticket
Advertisement
  • వైసీపీకి రాజీనామా చేయని నేతకు జనసేన టికెట్
  • సాలూరు చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా గొర్లె విజయకుమారి ఎంపిక
  • అధిష్ఠానం నిర్ణయంపై టీడీపీ, జనసేన శ్రేణుల ఆగ్రహం
  • వైఖరి మార్చుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలు తప్పవన్న స్థానిక నేతలు
Advertisement
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పురపాలక సంఘంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక జనసైనికులకు పార్టీ అధిష్ఠానం ఊహించని నిర్ణయంతో షాక్ ఇచ్చింది. ప్రతిపక్ష వైసీపీలో కొనసాగుతున్న నాయకురాలికే జనసేన పార్టీ తరఫున చైర్‌పర్సన్ టికెట్‌ను కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అనూహ్య పరిణామంతో అటు టీడీపీ, ఇటు జనసేన స్థానిక శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన గొర్లె విజయకుమారి, 2023 తర్వాత తన భర్తతో కలిసి వైకాపాలో చేరారు. అయితే, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆమెకు టికెట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో, ఆమెకు అనూహ్యంగా జనసేన నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం ఖరారు కావడం గమనార్హం.

అయితే, విజయకుమారి ఇప్పటివరకు వైసీపీకి అధికారికంగా రాజీనామా చేయలేదు. అలాగే జనసేన పార్టీలో సభ్యత్వం కూడా తీసుకోలేదు. అయినప్పటికీ ఆమెకు టికెట్ కేటాయించడం కూటమిలో రాజకీయ దుమారం రేపుతోంది. జనసేన అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయకుమారికి తాము సహకరించేది లేదని తెలుగుదేశం శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు, పార్టీ అధిష్ఠానం తన వైఖరి మార్చుకోకపోతే తామంతా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని స్థానిక జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం సాలూరు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ నాగబాబు, 32 కౌన్సిలర్ స్థానాల్లోనూ నామినేషన్లు వేయాలని సూచించారని.. అటువంటిది తమతో కనీస సంప్రదింపులు జరపకుండా చైర్‌పర్సన్ టికెట్‌ను ఎలా ప్రకటిస్తారని స్థానిక నేతలు నిలదీస్తున్నారు. ఈ పరిణామాలతో సాలూరులో కూటమి పొత్తుల రాజకీయాలు గందరగోళంలో పడ్డాయి.
Advertisement
Advertisement
Gorle Vijayakumari
Janasena Party
Saluru Municipality
Parvathipuram Manyam
Andhra Pradesh Municipal Elections
YSRCP

More Telugu News