Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో హిందూ ఆలయంపై మారణహోమానికి కుట్ర.. తుపాకీ మొరాయించడంతో తప్పిన పెను ముప్పు

Conspiracy for massacre at Hindu temple in USA foiled after gun jams
Advertisement
  • షికాగో సమీపంలోని హిందూ ఆలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం
  • 19 ఏళ్ల శ్వేతజాత్యహంకారి అలెక్సాండ్రోస్‌ పాపొరాకిస్‌ అరెస్ట్ 
  • ఆలయానికి వెళ్లినప్పుడు తుపాకీ మొరాయించడంతో తప్పిన పెను ప్రమాదం
  • నిందితుడి నుంచి ఏఆర్-స్టైల్ రైఫిల్, భారీగా తూటాలు స్వాధీనం
  • అప్రమత్తంగా ఉండాలని హిందూ సమాజానికి అధికారుల సూచన
Advertisement
అమెరికాలో హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ భారీ ఉగ్రదాడి కుట్రను పోలీసులు భగ్నం చేశారు. షికాగో సమీపంలోని అరోరా ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయంపై సామూహిక కాల్పులకు పాల్పడేందుకు పథకం రచించిన 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు అలెక్సాండ్రోస్ పాపొరాకిస్ (19) శ్వేతజాత్యహంకార, నియో-నాజీ భావజాలంతో ఈ దారుణానికి ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో తేలింది. తుపాకీ మొరాయించడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పిందని అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. పాలటైన్‌కు చెందిన పాపొరాకిస్, తన సహోద్యోగులతో పంచుకున్న కొన్ని ఎలక్ట్రానిక్ సందేశాలు అనుమానాస్పదంగా ఉండటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు అక్టోబర్ 11న అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాపొరాకిస్ నుంచి "నేనెందుకు పోరాడాను: అరోరా షూటర్ మేనిఫెస్టో" పేరుతో ఉన్న 8 పేజీల పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అందులో దక్షిణాసియా, ముఖ్యంగా భారత సంతతి ప్రజలపై తీవ్రమైన ద్వేషాన్ని, హింసను ప్రేరేపించే రాతలు ఉన్నట్లు గుర్తించారు. అరోరాలోని అతిపెద్ద హిందూ దేవాలయంపై దాడి చేయాలని, ఆదివారం 'ఒక ప్రత్యేకమైన రోజు' కాబోతోందని నిందితుడు తన సహోద్యోగులకు చెప్పినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.

పోలీసుల దర్యాప్తులో మరింత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం రోజు నిందితుడు పాపొరాకిస్ ఆయుధాలతో అరోరాలోని హిందూ ఆలయానికి చేరుకున్నాడు. అక్కడ కాల్పులు జరపడానికి ప్రయత్నించగా, అతని తుపాకీ మొరాయించింది. దీంతో విఫలయత్నం చేసిన అతను, ఇంటికి తిరిగివచ్చి తుపాకీని ఎలా సరిచేయాలో ఆన్‌లైన్‌లో వెతికాడు.

ఈలోగానే సహోద్యోగి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని నివాసంలో సోదాలు చేయగా, ఏఆర్-స్టైల్ రైఫిల్, లోడ్ చేసిన అనేక మ్యాగజైన్లు, వందలాది రౌండ్ల తూటాలు, బాడీ ఆర్మర్‌తో కూడిన టాక్టికల్ వెస్ట్, శ్వేతజాత్యహంకారాన్ని తెలిపే వస్తువులు లభ్యమయ్యాయి.

ఈ ఘటన తీవ్రతను తక్కువగా అంచనా వేయలేమని పాలటైన్ పోలీస్ చీఫ్ విలియం నార్డ్ అన్నారు. అరోరా పోలీసులు, స్థానిక హిందూ దేవాలయాల నిర్వాహకులను అప్రమత్తం చేశామని, ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. నిందితుడిపై టెర్రరిస్ట్ బెదిరింపు, చట్టవిరుద్ధ ఆయుధాల స్వాధీనం కింద కేసులు నమోదు చేశారు. కుక్ కౌంటీ కోర్టు అతడికి బెయిల్ నిరాకరించగా, తదుపరి విచారణ అక్టోబర్ 30న జరగనుంది. ఎఫ్‌బీఐ సహకారంతో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

హిందూ సమాజం స్పంద‌న ఇదే!
ఈ ఘటనపై స్పందించిన హిందూ అమెరికన్ ఫౌండేషన్, వేగంగా స్పందించి కుట్రను భగ్నం చేసిన పోలీసులను అభినందించింది. "ప్రతి సమాజానికి భయం లేకుండా ప్రార్థనలు చేసుకునే హక్కు ఉంది. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే అధికారులకు తెలియజేయాలి" అని హిందూ సమాజానికి పిలుపునిచ్చింది.
Advertisement
Advertisement
Alexandros Paparakis
Aurora Hindu Temple
Chicago terror plot
White supremacist attack
Hindu American Foundation
US Hindu temple security

More Telugu News