Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెర్మ్ నుంచి తొలగింపు, జేడీ వాన్స్ వ్యాఖ్యలు.. మైక్రోసాఫ్ట్ గట్టి కౌంటర్

Microsoft strong counter to JD Vance comments and PERM removal
Advertisement
  • టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌పై అమెరికా ప్రభుత్వం చర్యలు
  • పెర్మ్ గ్రీన్ కార్డ్ కార్యక్రమం నుంచి తాత్కాలిక సస్పెన్షన్
  • అమెరికన్లను తొలగించి విదేశీయులను నియమించుకుంటున్నారని ఆరోపణలు
  • ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మైక్రోసాఫ్ట్
Advertisement
అమెరికన్ ఉద్యోగుల స్థానంలో హెచ్-1బీ వీసాదారులను నియమించుకుంటోందన్న ఆరోపణలతో, మైక్రోసాఫ్ట్ సంస్థను 'పెర్మ్' (పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్-PERM) గ్రీన్ కార్డ్ ప్రక్రియ నుంచి ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. మైక్రోసాఫ్ట్ ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తోందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలను మైక్రోసాఫ్ట్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తాము ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.

ఈ వివాదంపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తాము దాఖలు చేసిన సుమారు 6,000 హెచ్-1బీ దరఖాస్తుల్లో దాదాపు 80 శాతం దరఖాస్తులు, ఇప్పటికే సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల వీసా పొడిగింపు లేదా వారి హోదా (స్టేటస్) మార్పునకు సంబంధించినవేనని వివరించింది. ఇవి కొత్త నియామకాలు కావని స్పష్టం చేసింది. మిగిలిన దరఖాస్తులు సైతం అమెరికాలో ఇప్పటికే చట్టబద్ధంగా నివసిస్తూ తమ సంస్థలో చేరిన వారికి సంబంధించినవని, వీరు తమ మొత్తం అమెరికా సిబ్బందిలో కేవలం ఒక శాతం మాత్రమేనని పేర్కొంది. హెచ్-1బీ ఉద్యోగులకు సైతం సమాన పనికి సమాన వేతనం అందిస్తున్నామని, టెక్ రంగంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న సంస్థల్లో తమది ఒకటని ఈ సందర్భంగా వెల్లడించింది.

గత ఏడాది మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మంది ఉద్యోగులను తొలగించిందని, అదే సమయంలో దాదాపు 6,300 హెచ్-1బీ వీసాలు, 3,000 గ్రీన్ కార్డులకు అనుమతులు పొందిందని జేడీ వాన్స్ ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమెరికా కార్మిక శాఖ మైక్రోసాఫ్ట్‌పై చర్యలు తీసుకుంది.

మైక్రోసాఫ్ట్‌తో పాటు అడోబ్ సహా మరికొన్ని ప్రధాన ఐటీ సంస్థలను కూడా పెర్మ్ కార్యక్రమం నుంచి సస్పెండ్ చేశారు. ఈ జాబితాలో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీ వంటి భారత ఐటీ దిగ్గజాలు కూడా ఉండటం గమనార్హం. ఈ సస్పెన్షన్ కారణంగా సదరు కంపెనీలు ప్రస్తుతానికి కొత్తగా పెర్మ్ దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండదు. అయితే, కొత్త హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేసుకోవడంపై గానీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల హోదాపై గానీ ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదు.

మరోవైపు, ఈ తాజా పరిణామాలు అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం వేచిచూస్తున్న భారతీయ ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Advertisement
Advertisement
Microsoft
JD Vance
H-1B Visa
PERM Green Card Program
US Department of Labor
Indian IT sector

More Telugu News