Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం విజయ్ ఎన్నికల కేసు.. తీర్పు అక్టోబర్ 14కి వాయిదా

CM Vijay election case verdict postponed to October 14
Advertisement
  • పెరంబూర్ నియోజకవర్గంలో తన గెలుపును సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని విజయ్ అభ్యర్థన
  • రూ.30 కోట్ల విలువైన భూమి, క్రిమినల్ కేసుల వివరాలు దాచారని పిటిషనర్ ఆరోపణ
  • నామినేషన్‌లో అన్ని వివరాలు వెల్లడించామన్న సీఎం తరఫు న్యాయవాది 
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఎన్నికకు సంబంధించిన కేసులో తీర్పును మద్రాస్ హైకోర్టు వాయిదా వేసింది.  పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన అభ్యర్థనపై తీర్పును అక్టోబర్ 14వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. గురువారం ఈ పిటిషన్‌పై జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను విన్నది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి 53,715 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, దినేశ్ అనే ఓటరు ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. నామినేషన్ పత్రాల్లో విజయ్ పలు కీలక వివరాలను గోప్యంగా ఉంచారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎన్నికల అఫిడవిట్‌లో అన్ని వివరాలను చట్టప్రకారమే పొందుపరిచామని, ఏ సమాచారాన్ని దాచిపెట్టలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సదరు పిటిషన్‌ను కొట్టివేయాలని ఆయన కోరారు.

పన్రుటిలో కొనుగోలు చేసిన రూ.30 కోట్ల విలువైన వ్యవసాయ భూమి వివరాలతో పాటు, కొడైకెనాల్‌లోని విల్పాట్టి గ్రామంలో ఉన్న 50 సెంట్ల భూమి సమాచారాన్ని విజయ్ వెల్లడించలేదని పిటిషనర్ ఆరోపించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ప్రభుత్వ మిగులు భూమి అని పేర్కొన్నారు. వీటితో పాటు కొన్ని క్రిమినల్ కేసుల వివరాలను కూడా వెల్లడించలేదని, ఇది అవినీతి చర్యల కిందకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

వాదనల సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. ఒకవేళ ఎవరైనా భూమిని ఆక్రమించుకుంటే వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారా? అని ప్రశ్నించారు. అలాగే, విల్పాట్టి భూమికి సంబంధించిన సేల్ డీడ్‌ను నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించారా? అని ఆరా తీశారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో, పిటిషన్‌ను కొట్టివేయాలన్న అభ్యర్థనపై తన తుది తీర్పును అక్టోబర్ 14న వెల్లడిస్తామని న్యాయస్థానం ప్రకటించింది.
Advertisement
Advertisement
Vijay
Madras High Court
Perambur constituency
Tamil Nadu CM election case
Election petition verdict
Asset disclosure row

More Telugu News