Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో వైభవంగా చక్రస్నానం.. ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala Srivari Brahmotsavams conclude grandly with Chakrasnanam
Advertisement
  • శ్రీవారి బ్రహ్మోత్సవాల ముగింపు
  • నేడు చక్రస్నానం
  • పవిత్ర పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించిన వేలాది మంది భక్తులు
  • మలయప్ప స్వామి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
  • 8 రోజుల్లో 5.76 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపిన టీటీడీ
  • సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఉత్సవాలు విజయవంతం చేశామన్న బీఆర్ నాయుడు
Advertisement
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం నాడు చక్రస్నానంతో కన్నులపండువగా ముగిశాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఉత్సవాల చివరి రోజున స్వామి పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానం ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలికారు.

అంతకుముందు, ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీవారికి సర్వభూపాల పల్లకి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శ్రీ భూవరాహ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి, సుదర్శన చక్రత్తాళ్వార్‌కు వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం చేపట్టారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో శంఖులు, కలశాల ద్వారా అభిషేకం చేశారు. ఈ సమయంలో వేద పండితులు ఉపనిషత్తులు, పంచ సూక్తాలు (పురుష, శ్రీ, భూ, నీలా, విష్ణు) పఠించగా, జీయర్ స్వాముల సమక్షంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు.

అభిషేకం అనంతరం, సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా స్వామి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి, వేదమంత్రాల ఘోష నడుమ పవిత్ర జలాల్లో స్నానం చేయించారు. అదే శుభ సమయంలో, "గోవిందా... గోవిందా..." అంటూ భక్తి పారవశ్యంతో నామస్మరణ చేస్తూ, పుష్కరిణి వద్ద వేచి ఉన్న వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సుదర్శన చక్రం స్పృశించిన జలాల్లో స్నానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఆగమశాస్త్రం ప్రకారం, బ్రహ్మోత్సవాలను ఒక మహాయజ్ఞంగా పరిగణిస్తారు. ఉత్సవాల నిర్వహణలో ఏవైనా లోటుపాట్లు జరిగితే, ఈ చక్రస్నానం (అవభృథ స్నానం) ద్వారా అవి తొలగిపోయి, భక్తులకు, లోకానికి సంపూర్ణ ఫలం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం.

విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిరంతర మార్గదర్శకత్వంతోనే బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై సీఎం సూచనలతో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టామన్నారు. గత 8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని, ప్రతి భక్తుడు సంతృప్తిగా దర్శనం చేసుకునేలా సమష్టిగా పనిచేశామని వివరించారు. 

ఈ విజయానికి సహకరించిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులు సహా ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సేవే తమ ప్రథమ కర్తవ్యమని, శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Advertisement
Tirumala Srivari Brahmotsavams
Chakrasnanam
TTD Chairman BR Naidu
Lord Venkateswara
Swami Pushkarini
Tirumala Tirupati Devasthanams

More Telugu News