Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభుత్వానికి 121 ఎకరాల భూమిని వెనక్కిచ్చిన రామ్‌కో సిమెంట్స్!

Ramco Cements returns 121 acres of land to government why
Advertisement
  • నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో భూములు
  • మైనింగ్‌కు ఆటంకాలే కారణమని తెలిపిన కంపెనీ
  • భూముల సరెండర్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Advertisement
ప్రముఖ సిమెంట్ ఉత్పాదక సంస్థ రామ్‌కో సిమెంట్స్, గతంలో తమకు కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. నంద్యాల జిల్లాలో సున్నపురాయి మైనింగ్ నిమిత్తం కేటాయించిన 121.74 ఎకరాల భూమిని సరెండర్ చేస్తున్నట్లు కంపెనీ చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర గనుల శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల పరిధిలోని ఇటిక్యాల, కల్వట్ల, కొలిమిగుండ్ల గ్రామాల్లో ఈ భూమి విస్తరించి ఉంది. వాస్తవానికి, 2000వ సంవత్సరంలో రామ్‌కో సిమెంట్స్ సంస్థకు ప్రభుత్వం సుమారు 250 హెక్టార్ల భూమిని సున్నపురాయి మైనింగ్ లీజుకు కేటాయించింది. అందులో భాగంగా ఉన్న 121.74 ఎకరాల భూమిని తాజాగా కంపెనీ ప్రభుత్వానికి అప్పగించింది.

ఆ భూమిలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యం కావడం లేదని రామ్‌కో సిమెంట్స్ తన అభ్యర్థనలో పేర్కొంది. లీజుకు తీసుకున్న భూమిని ఆనుకుని ఒక కాలువ ప్రవహిస్తుండటంతో పాటు, అదే ప్రాంతంలో హై-టెన్షన్ విద్యుత్ టవర్లు ఉండటం వల్ల మైనింగ్ పనులకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని కంపెనీ స్పష్టం చేసింది.

కంపెనీ విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. సంస్థ స్వచ్ఛందంగా ముందుకు రావడంతో, సదరు 121.74 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఈ భూమిపై రామ్‌కో సిమెంట్స్ మైనింగ్ హక్కులు రద్దయ్యాయి.                                
Advertisement
Advertisement
Ramco Cements
Nandyal district
Limestone mining lease
Andhra Pradesh Government
Land surrender
Mines Department

More Telugu News