జాబ్‌ కోసం ఎంత అప్లై చేసినా రాకపోతే? ఈ 6 స్మార్ట్‌ టిప్స్‌ పాటించండి..!

Catherine Fisher shares 6 smart tips to follow if you are not getting a job despite applying
  • ఉద్యోగ వేటలో ‘డూమ్‌జాబింగ్‌’ను నివారించాలని నిపుణురాలి సూచన
  • ఏ ఉద్యోగం కావాలో ముందే స్పష్టత తెచ్చుకోవాలి
  • ఉద్యోగం కోసం నేరుగా అడగడం కంటే పరిచయాలు పెంచుకోవాలి
  • రెజ్యూమేలో బాధ్యతల కంటే సాధించిన ఫలితాలు చూపాలి
  • ఏఐ నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్‌, నాయకత్వం ముఖ్యం
ఉద్యోగం కావాలి.. ఏదో ఒక జాబ్‌ దొరికే వరకు దరఖాస్తులు పంపుతూనే ఉండాలి.. ఇదేనా మీ జాబ్‌ సెర్చ్‌ ప్లాన్‌? అయితే కాస్త ఆగండి. రోజంతా జాబ్‌ పోర్టల్స్‌ స్క్రోల్‌ చేస్తూ, కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేయడం వల్ల అవకాశాలు పెరగకపోగా అలసటే మిగులుతుందని లింక్డ్‌ఇన్‌ కెరీర్‌ నిపుణురాలు క్యాథరిన్‌ ఫిషర్‌ చెబుతున్నారు. ఈ అలవాటుకు ఆమె పెట్టిన పేరు ‘డూమ్‌జాబింగ్‌’. ఉద్యోగ వేటలో సంఖ్య కంటే వ్యూహమే ముఖ్యమని ఆమె సూచిస్తున్నారు.

1. ముందుగా ఏం కావాలో తేల్చుకోండి
ఏ నగరంలో పని చేయాలి? ఏ రంగంలో చేరాలి? ఎలాంటి ఉద్యోగం కావాలి? ముందుగా స్పష్టత తెచ్చుకోవాలి. ఆ తర్వాత రెజ్యుమే, ప్రొఫెషనల్‌ ప్రొఫైల్‌ను ఆ ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా మార్చుకోవాలి. ఏఐపై అవగాహన పెంచుకోవడం కూడా ఉపయోగపడుతుందని ఫిషర్‌ సూచిస్తున్నారు.

2. పరిచయాలను పెంచుకోండి
ఉద్యోగం కోసం నేరుగా అడగడం కంటే.. ఆ రంగంలో పనిచేస్తున్న వారితో పరిచయం పెంచుకోవాలి. లింక్డ్‌ఇన్‌లో రెండో స్థాయి పరిచయాల ద్వారా కొత్త వ్యక్తులను సంప్రదించొచ్చు. వారి అనుభవం గురించి అడగడం ద్వారా సంభాషణ మొదలుపెట్టాలని నిపుణురాలు సూచిస్తున్నారు.

3. బాధ్యతలు కాదు.. ఫలితాలు చెప్పండి
రెజ్యుమేలో ఏం చేశారో మాత్రమే రాయడం సరిపోదు. ఆ పని వల్ల సంస్థకు ఏం ప్రయోజనం కలిగిందో చెప్పాలి. సాధించిన ఫలితాలను ఉదాహరణలతో వివరించాలి. గణాంకాలు వెల్లడించలేని సందర్భాల్లోనూ పని ప్రభావం అర్థమయ్యేలా వివరించాలని ఫిషర్‌ చెబుతున్నారు.

4. ‘హ్యూమన్‌ స్కిల్స్‌’ను మర్చిపోవద్దు
ఏఐ సహా సాంకేతిక నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతున్నా.. కమ్యూనికేషన్‌, నాయకత్వ లక్షణాలు కూడా అంతే కీలకం. ఆయా రంగాల్లో మంచి పేరు ఉన్నవారు ఎలా మాట్లాడతారు? ఎలా నాయకత్వం వహిస్తారు? అన్నది గమనించి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

5. ఉద్యోగ వేటకూ విరామం అవసరమే
రోజంతా అప్లికేషన్లు పంపుతూ ఉంటే ఉద్యోగ అన్వేషణ ఒత్తిడిగా మారొచ్చు. అందుకే రోజంతా జాబ్స్‌ వెతకడం కంటే నిర్దిష్ట సమయం కేటాయించాలి. మిగిలిన సమయంలో కొత్త నైపుణ్యం నేర్చుకోవడం లేదా ఒక ప్రొఫెషనల్‌ పరిచయం పెంచుకోవడం వంటి పనులు చేయాలి.

6. విజయానికి కొత్త అర్థం చెప్పుకోండి
వెంటనే ‘పర్ఫెక్ట్‌ జాబ్‌’ రావాలనే ఆలోచన నుంచి బయటపడాలి. పార్ట్‌టైమ్‌, తాత్కాలిక కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు కూడా అనుభవాన్ని పెంచుతాయి. కొత్త పరిచయాలకు దారి తీస్తాయి. ఊహించని ఉద్యోగ అవకాశం వచ్చినా దాన్ని పూర్తిగా తోసిపుచ్చకుండా పరిశీలించాలని ఫిషర్‌ సూచిస్తున్నారు.
Advertisement
Catherine Fisher
Job search tips
LinkedIn career advice
Resume building strategies
Doomjobbing
Career growth skills

More Telugu News