Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వరం లేదు.. సంగీతం లేదు.. కానీ వీరి ‘జనగణమన’ విని కన్నీళ్లు పెట్టుకున్న దేశం!

Silent National Anthem video that moved the entire nation to tears
Advertisement
  • మాటలు లేకుండానే ‘జనగణమన’ను ఆవిష్కరించిన చిన్నారులు
  • దాదాపు 500 మంది ప్ర్యతేక అవసరాలు ఉన్న పిల్లలు పాల్గొన్న వైనం
  • సంకేత భాషలో జాతీయ గీతాన్ని ప్రదర్శించిన చిన్నారులు
  • ‘దేశభక్తికి భాష లేదు’ అనే ఆలోచనతో ప్రచారం 
  • భావోద్వేగంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మౌన గీతం
  • కాన్స్‌ లయన్స్‌లో ఒక సిల్వర్‌, రెండు బ్రాంజ్‌ అవార్డులు
Advertisement
దేశభక్తికి భాష అవసరం లేదు.. గుండెల్లో దేశం ఉంటే చాలు. జాతీయ గీతం వినిపించకపోయినా ప్రతి హృదయంలో మార్మోగొచ్చు. మాటలు పలకలేని చిన్నారులు చేతులతో ‘జనగణమన’ను ఆవిష్కరించిన ఆ క్షణం.. దేశభక్తికి కొత్త అర్థం చెప్పింది. దాదాపు 500 మంది చిన్నారులు ఒక్కసారిగా తమ చేతులను కదిలిస్తుంటే.. సంగీతం, శబ్దం లేకపోయినా దేశభక్తి మార్మోగింది. ప్రతి కదలికలో భారత్‌ కనిపించింది. ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించిన ఆ మౌన గీతం.. దేశభక్తికి అసలు స్వరం హృదయమేనని చాటిచెప్పింది.

ముద్రా గ్రూప్‌.. బిగ్‌ సినిమాస్‌ కోసం 2011లో రూపొందించిన ‘ది సైలెంట్‌ నేషనల్‌ ఆంథమ్‌’ ప్రచారం వెనుక ఈ అద్భుతమైన ఆలోచన ఉంది. ‘‘దేశభక్తికి భాష లేదు’’ అంటూ బాబీ పవార్‌ ఆలోచన నుంచి ఈ ప్రయోగం పుట్టింది. సాధారణంగా జాతీయ గీతాన్ని వింటాం. కానీ ఈసారి దాన్ని వినకుండా చూడాల్సి వచ్చింది. వినికిడి, మాటల లోపం ఉన్న చిన్నారులు సంకేత భాషలో ‘జనగణమన’ను ప్రదర్శించారు.

ముంబయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు చెందిన 8 పాఠశాలల్లోని దాదాపు 500 మంది చిన్నారులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి చిన్నారి చేతి కదలికలో ఓ భావం కనిపించింది. ప్రతి చూపులో ఓ గర్వం ప్రస్పుటమైంది. ప్రతి సంకేతంలో ‘నేను భారతీయుడిని’ అనే మాట వినిపించింది. వారి గొంతులు వినిపించకపోయినా.. వారి దేశభక్తి మాత్రం ప్రేక్షకుల హృదయాలను తాకింది. థియేటర్‌లో ఆ దృశ్యాన్ని చూసిన చాలామంది కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

ఈ ప్రచారంలో పెద్ద పెద్ద మాటలు లేవు. భారీ హంగులు లేవు. కేవలం నిర్మలమైన చిన్నారులు.. నిజమైన భావోద్వేగం.. కొన్ని చేతి కదలికలు మాత్రమే ఉన్నాయి. అదే దాని బలంగా మారింది. దేశభక్తిని వినిపించకుండా అనుభూతి చెందేలా చేసిన ఈ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కాన్స్‌ లయన్స్‌లో ఒక సిల్వర్‌, రెండు బ్రాంజ్‌ అవార్డులను సొంతం చేసుకుంది.

ఆ మౌనం ఓ సందేశంగా మారింది. దేశం అంటే కేవలం వినిపించే గీతం కాదు.. అనుభూతి చెందే భావం అని చెప్పింది. స్వరం లేకపోయినా దేశభక్తి ఉంటుంది. మాటలు లేకపోయినా ప్రేమ ఉంటుంది. ఆ చిన్నారుల చేతుల్లో కదిలిన ‘జనగణమన’.. భారత మాతపై ప్రేమకు శబ్దం అవసరం లేదని ప్రపంచానికి చాటి చెప్పింది.
Advertisement
Advertisement
Silent National Anthem
Indian National Anthem
Sign Language Jana Gana Mana
Mudra Group Big Cinemas
Bobby Pawar Campaign
Cannes Lions Winning Ad

More Telugu News