Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ ఎమ్మెల్యే అల్లుడి ఘరానా మోసం: ఫేక్ ఐడీలతో 25 పెళ్లిళ్లు.. కోట్లలో దోపిడీ!

BJP MLA son in law fraud 25 marriages with fake IDs and crores looted
Advertisement
  • యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు అల్లుడి రూపంలో ఘోర మోసం 
  • ముంబైలో వందల కోట్ల ఆస్తులున్నాయని నమ్మించి పెళ్లి
  • ఎమ్మెల్యే ఫిర్యాదుతో తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఎమ్మెల్యే డిమాండ్
Advertisement
ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి చెందిన ఓ శాసనసభ్యుడు దారుణంగా మోసపోయారు. సేవతా నియోజకవర్గ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ అల్లుడు.. ఓ అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడని, దేశవ్యాప్తంగా నకిలీ గుర్తింపులతో ఏకంగా 25 పెళ్లిళ్లు చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నాడని తేలింది. ఈ దారుణ మోసంపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడైన అల్లుడు ప్రకార్ త్రివేది, అతడి తండ్రి అనుజ్ త్రివేదిని శనివారం అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ 2024లో తన కుమార్తె ప్రజ్ఞ వివాహాన్ని మిశ్రిఖ్ ప్రాంతానికి చెందిన ప్రకార్ త్రివేదితో అంగరంగ వైభవంగా జరిపించారు. పెళ్లికి ముందు ప్రకార్ తండ్రి అనుజ్ త్రివేది, తమకు ముంబైలో వందల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని నమ్మబలికారు. స్థానికంగా కూడా మంచి పేరున్నట్లు చిత్రీకరించడంతో ఎమ్మెల్యే ఈ సంబంధానికి అంగీకరించారు. తమ నేర చరిత్రను, కేసులను త్రివేది కుటుంబం ఆ సమయంలో అత్యంత లౌక్యంగా దాచిపెట్టింది.

వివాహమైన రెండేళ్ల తర్వాత అసలు నిజం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రకార్ త్రివేది నకిలీ పేర్లు, ఫేక్ ఐడీ కార్డులు వాడుతూ మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో సుమారు 25 మంది యువతులను పెళ్లి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత వారి కుటుంబాలను మోసం చేసి, కోట్ల రూపాయల డబ్బు, ఆభరణాలతో పరారవడం అతడికి అలవాటని తేలింది.

ఈ మోసం గురించి తెలియగానే ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆగస్టు 6న తన కుమార్తెతో కలిసి ఓ వీడియోను విడుదల చేశారు. తన కుమార్తెను తిరిగి ఇంటికి తీసుకొచ్చేశామని, ఆ మోసపూరిత కుటుంబంతో అన్ని సంబంధాలు తెంచుకున్నామని ప్రకటించారు. అనంతరం రేవుసా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో శనివారం తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను మోసం చేసిన వియ్యంకుడు అనుజ్ త్రివేదికి ఉరిశిక్ష విధించాలని, తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన ప్రకార్ త్రివేదికి చట్ట ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడాలని ఆయన మీడియా ముందు డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement
Prakhar Trivedi
Gyan Tiwari
Fake ID marriage fraud
Uttar Pradesh crime news
Anuj Trivedi arrest
Serial marriage scammer

More Telugu News