పిల్లలను ఇలా శిక్షిస్తున్నారా?.. తెలియకుండానే వారి భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు!

Are you punishing children like this You are unknowingly damaging their future
  • ఆలోచించి పిల్లలను శిక్షించాలంటున్న నిపుణులు
  • అరవడం, అందరి ముందు తిట్టడం సరికాదని సూచన
  • పోల్చడం, దూరం పెట్టడం వల్ల వారిని మరింత బాధిస్తుందని వివరణ
  • తప్పునకు తగిన శిక్షే విధించాలని సూచన
  • తప్పు చేయడం వెనక కారణాన్నీ తెలుసుకోవాలని హితవు
పిల్లల పెంపకంలో క్రమశిక్షణ తప్పనిసరి. కానీ దాని పేరుతో వేసే ప్రతి శిక్ష సరైన ఫలితాన్ని ఇవ్వదు. కొన్ని ఆ క్షణంలో పిల్లలను మౌనంగా ఉంచినా.. వారి మనసులో భయం, అవమానం, ఆత్మవిశ్వాసం లోపించడం వంటి సమస్యలకు దారితీస్తాయని చిన్నారుల మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే తల్లిదండ్రులు తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ, పిల్లల మనసును గాయపరచకూడదని సూచిస్తున్నారు.

1. గట్టిగా అరవడం
పిల్లలు మాట విననప్పుడు చాలా మంది తల్లిదండ్రులు గట్టిగా అరుస్తుంటారు. దీంతో వారు వెంటనే ఆగినట్లు కనిపించినా.. అది భయంతో మాత్రమే. తరచూ అరవడం వల్ల పిల్లల్లో ఆందోళన పెరుగుతుంది. కొంతకాలానికి వారు అలాంటి అరుపులను కూడా పట్టించుకోరు. ప్రశాంతంగా, స్పష్టంగా చెప్పిన మాటే ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

2. అందరి ముందు తిట్టడం లేదా శిక్షించడం
బంధువుల ముందు, షాపింగ్‌ మాల్‌లో లేదా స్కూల్‌లో పిల్లలను అవమానించడం వారికి తీవ్ర మానసిక బాధ కలిగిస్తుంది. తాము చేసిన తప్పు గురించి ఆలోచించకుండా.. అందరి ముందు అవమానించారనే భావన వారిలో మిగిలిపోతుంది. అందుకే వీలైనంత వరకు ఒంటరిగా మాట్లాడి తప్పును వివరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

3. ఇతర పిల్లలతో పోల్చడం
‘నీ అక్కలా ఎందుకు ఉండలేవు?’, ‘పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో’ వంటి మాటలు చాలా ఇళ్లలో వినిపిస్తుంటాయి. కానీ ఇలాంటి పోలికలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తోబుట్టువులు లేదా స్నేహితులపై అసూయ పెరగడానికి కూడా ఇవే కారణమవుతాయి. ప్రతి చిన్నారి ప్రత్యేకమనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి.

4. ప్రేమను దూరం చేయడం
కొంతమంది పిల్లలతో మాట్లాడకుండా ఉండటం, ఆప్యాయంగా దగ్గరికి తీసుకోకపోవడం లేదా ‘నాతో మాట్లాడొద్దు’ అని చెప్పడం చేస్తుంటారు. చిన్నారులకు ఇది చాలా పెద్ద శిక్షగా అనిపిస్తుంది. తాము తప్పు చేస్తే అమ్మానాన్న ప్రేమ తగ్గిపోతుందనే భయం వారిలో పెరుగుతుంది. తప్పును తప్పుబట్టాలి కానీ.. ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గకూడదు.

5. తప్పుకు సంబంధం లేని శిక్ష వేయడం
జ్యూస్ కింద ఒలకబోస్తే వారం రోజుల పాటు టీవీ చూడనివ్వకపోవడం, హోంవర్క్‌ మరిచిపోతే బొమ్మలన్నీ తీసేయడం వంటి శిక్షలు పిల్లలకు అర్థం కావు. చేసిన తప్పుకు సంబంధం ఉన్న పరిణామాన్ని చూపితేనే వారు నేర్చుకుంటారు. గది చెదరగొడితే వారితోనే సర్దించడం వంటి శిక్షలు ఎక్కువ ఉపయోగపడతాయి.

6. పేర్లు పెట్టి తిట్టడం
‘బద్ధకస్థుడు’, ‘అల్లరి పిల్ల’, ‘పనికిరాని వాడివి’ వంటి మాటలు పిల్లల మనసులో బలంగా ముద్రపడతాయి. పదేపదే ఇలాంటి మాటలు వింటే అదే తమ స్వభావమని వారు నమ్మే ప్రమాదం ఉంది. పిల్లలను కాకుండా.. వారి ప్రవర్తనను మాత్రమే తప్పుబట్టాలని నిపుణులు చెబుతున్నారు.

7. శారీరక శిక్ష
కొట్టడం వల్ల పిల్లలు వెంటనే మౌనంగా ఉండొచ్చు. కానీ అది తప్పని తెలుసుకుని కాదు.. భయంతో. పరిశోధనల ప్రకారం శారీరక శిక్ష వల్ల పిల్లల్లో కోపం, భయం, ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. సమస్యలను బలప్రయోగంతో పరిష్కరించవచ్చనే తప్పు భావన కూడా వారిలో ఏర్పడుతుంది.

8. ప్రవర్తన వెనుక కారణాన్ని పట్టించుకోకపోవడం
ప్రతి అల్లరి వెనుక ఒక కారణం ఉండొచ్చు. ఆకలి, అలసట, ఒత్తిడి, అసూయ లేదా భావోద్వేగాలను చెప్పలేకపోవడం వల్ల కూడా పిల్లలు అలా ప్రవర్తిస్తారు. కారణాన్ని తెలుసుకోకుండా శిక్షిస్తే సమస్య అలాగే ఉంటుంది. అందుకే ముందు కారణాన్ని అర్థం చేసుకుని, తర్వాత క్రమశిక్షణ నేర్పడం ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు కావాల్సింది భయం కాదు.. భరోసా
ఏ తల్లిదండ్రులూ పరిపూర్ణులు కారు. కోపం రావడం సహజమే. కానీ తర్వాత పిల్లలతో మాట్లాడటం, అవసరమైతే క్షమాపణ చెప్పడం, ప్రేమతో తప్పును సరిదిద్దడం వారి వ్యక్తిత్వాన్ని మరింత బలంగా తీర్చిదిద్దుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఏ శిక్ష పడిందో గుర్తుపెట్టుకోకపోవచ్చు. కానీ తమ తప్పును కూడా ప్రేమతో అంగీకరించిన తల్లిదండ్రులను మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు.
Advertisement
Parenting
Child Discipline
Child Psychology
Parenting Mistakes
Child Mental Health
Positive Parenting

More Telugu News