ఐదు రోజులకే కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం.. భక్తుల్లో తీవ్ర నిరాశ!

Amarnath ice lingam melts in just five days causing disappointment among devotees
  • 90 శాతానికిపైగా కరిగిపోయిన మంచు లింగం 
  • హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం
  • పర్యావరణ పరిరక్షణపై మొదలైన జాతీయ చర్చ
  • రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల సంఖ్య
శతాబ్దాలుగా కోట్ల మంది హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే అమర్‌నాథ్ గుహలోని సహజసిద్ధ మంచు లింగం (బాబా బర్ఫానీ) యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజుల్లోనే 90 శాతానికిపైగా కరిగిపోవడం కలకలం రేపుతోంది. ఈ నెల 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. అయితే, యాత్ర మొదలైన మొదటి వారంలోనే మంచు లింగం దాదాపు అదృశ్యమవడంతో దర్శనానికి వస్తున్న భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ఈ  మార్పుపై పీడీపీ నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ సామాజిక మాధ్యమ వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తూ, గుహ పరిసరాల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజుకు కేవలం 10,000 మంది భక్తులను మాత్రమే అనుమతించాలనే నిబంధన ఉన్నప్పటికీ, మొదటి నాలుగు రోజుల్లోనే ఏకంగా 93,000 మందికి పైగా భక్తులు గుహను సందర్శించారు. అధికారిక నమోదు లేకుండా వస్తున్న వేలాది మంది అదనపు భక్తుల వల్ల అక్కడి మౌలిక వసతులపై, పర్యావరణంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

అమర్‌నాథ్ మంచు లింగం ఇంత వేగంగా కరిగిపోవడానికి గ్లోబల్ వార్మింగ్ (భూతాపం), మానవ కార్యకలాపాలే ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. గతంలో 2018, 2020, 2022 సంవత్సరాల్లోనూ మంచు లింగం త్వరగా కరిగినప్పటికీ.. ఈసారి కేవలం ఐదు రోజుల్లోనే కరిగిపోవడం పర్యావరణ విపత్తుకు అద్దం పడుతోంది. 

గుహకు సమీపంలో రోడ్ల వెడల్పు, భారీ యంత్రాల వాడకం, హెలికాప్టర్ల రాకపోకలు, ప్రతిపాదిత రోప్‌వే ప్రాజెక్ట్, భక్తుల శరీరం నుండి వెలువడే వేడి గుహ లోపలి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక యాత్రను భక్తులకు అందుబాటులో ఉంచుతూనే, హిమాలయాల సున్నితమైన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి తక్షణమే శాస్త్రీయ అధ్యయనం జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Amarnath Ice Lingam
Amarnath Yatra 2024
Baba Barfani
Global Warming Himalayas
Jammu Kashmir Tourism
Amarnath Cave Environment

More Telugu News