నిరాడంబర నేత కొమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూత.. స్కూటరే ఆస్తిగా బతికిన మాజీ ఎమ్మెల్యే!

  • ఈ తెల్లవారుజామున 5 గంటలకు నరసింహారెడ్డి కన్నుమూత
  • రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేని గొప్ప నేత
  • ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా కాంగ్రెస్ తరపున గెలిచిన ప్రజా నాయకుడు

భువనగిరి మాజీ ఎమ్మెల్యే, విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపమైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొమ్మిడి నరసింహారెడ్డి (85) ఈ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించిన ఆయన మృతి పట్ల రాజకీయ శ్రేణులు నివాళులర్పిస్తున్నాయి.


నరసింహారెడ్డి కేవలం 19 ఏళ్ల వయసులోనే 1962లో బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భువనగిరి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని రెండోసారి కూడా కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఆయన... మాజీ సీఎం డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి ప్రియశిష్యుడిగా మారి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాగునీటి రంగంపై అపార అధ్యయనం చేసిన ఆయన, గోదావరి జలాలను మూసీ నదిలోకి మళ్లించి లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చని బ్లూప్రింట్లతో సహా ప్రతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నిరంతరం పోరాడారు.


భువనగిరి ప్రాంత అభివృద్ధి కోసం సీసీఎంబీ ఏర్పాటుకు, అలాగే బీబీనగర్ నిమ్స్ అభివృద్ధికి ఆయన ఎంతో శ్రమించారు. నిమ్స్ పనులు ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ తన వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ఆసుపత్రి ఎదుట నిరాహార దీక్ష చేయగా... అప్పటి ప్రభుత్వం స్పందించి రూ.60 కోట్ల నిధులు మంజూరు చేసింది.


నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమ్మిడి కోదండరామిరెడ్డి ఈయనకు పెద్దన్న. ఆ పోరాట స్ఫూర్తితోనే నరసింహారెడ్డి కూడా భుజాన చిన్న సంచి, చేతిలో నోట్‌బుక్ పట్టుకుని జీవితాంతం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే బతికారు.


Kommidi Narasimha Reddy
Bhongir MLA
Telangana Congress Leader
NIMS Hyderabad
Simple Living Politician
Telangana Armed Struggle

More Telugu News