Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మనిషిలా హావభావాలు, మాట్లాడే రోబో: చైనా శాస్త్రవేత్తల సరికొత్త సృష్టి

UWORLD U1 Human like expressions and talking robot China latest creation
Advertisement
  • చైనా రోబోటిక్స్ సంస్థ 'యుబిటెక్' సరికొత్త ఆవిష్కరణ 
  • భావోద్వేగాలను గుర్తించే 'UWORLD U1' హ్యూమనాయిడ్ రోబో 
  • సిలికాన్ చర్మం, 88 జాయింట్లతో సహజసిద్ధమైన కదలికలు 
  • డేటా భద్రత కోసం ప్రత్యేక ఆన్-డివైజ్ స్టోరేజ్
  • లాంచ్ అయిన కాసేపటికే 13,000 పైగా ఆర్డర్లు
Advertisement
సాంకేతిక రంగంలో చైనా మరో సంచలన ఆవిష్కరణకు తెరలేపింది. ప్రముఖ చైనీస్ రోబోటిక్స్ సంస్థ 'యుబిటెక్' (UBTech), మానవ భావోద్వేగాలను అర్థం చేసుకుని స్పందించే సరికొత్త హ్యూమనాయిడ్ (మనిషి పోలికలున్న) కాంపా‌నియన్ రోబో 'యూవరల్డ్ యూ1' (UWORLD U1) ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం ఫ్యాక్టరీ పనులకే పరిమితం కాకుండా.. ఇళ్లలో ఒంటరిగా ఉండే వృద్ధులకు తోడుగా, సేవా రంగాల్లో సహాయకారిగా ఉండేలా దీనిని రూపొందించారు. జూన్ 30న షెన్‌జెన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ రోబోను అధికారికంగా ప్రదర్శించారు.

 అచ్చం మనిషిలాగే.. అద్భుత ఫీచర్లు 
ఈ రోబోకు అచ్చం మనిషి చర్మం లాంటి అనుభూతిని ఇచ్చే సిలికాన్ స్కిన్‌ను అమర్చారు. ఇది పురుష రూపంలో (183 సెం.మీ), మహిళ రూపంలో (168 సెం.మీ) లభిస్తుంది. శరీరంలో అమర్చిన 88 సర్వో జాయింట్ల (కదలికల కీళ్లు) సాయంతో ఇది ఎంతో సహజంగా కదులుతుంది.

ఎమోషనల్ ఏఐ: ఈ రోబో మనుషుల్లోని 20కి పైగా విభిన్న భావోద్వేగాలను సులభంగా గుర్తిస్తుంది. మాట్లాడేటప్పుడు కళ్లలోకి చూస్తూ సంభాషిస్తుంది. గతంలో జరిగిన సంభాషణలను గుర్తుంచుకుని, దానికి తగ్గట్టుగా సమాధానాలు ఇస్తుంది. మన పెదవుల కదలికలకు కేవలం 20 మిల్లీ సెకన్ల వ్యవధిలోనే ఇది స్పందిస్తుంది.
ప్రైవసీకి ప్రాధాన్యం: వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత కోసం క్లౌడ్ స్టోరేజ్ కాకుండా, రోబో లోపల ఉండే రాక్‌చిప్ ఆన్-డివైజ్ ప్రాసెసర్‌లోనే డేటాను భద్రపరుస్తుంది. దీనివల్ల ప్రైవసీ లీక్ అయ్యే ప్రమాదం ఉండదు.

ధర.. డిమాండ్
ఈ రోబోలు లైట్, ప్రో, అల్ట్రా అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు మోడల్‌ను బట్టి రూ. 14 లక్షల నుండి గరిష్ఠంగా రూ. 1.15 కోట్ల వరకు ఉన్నాయి. ఈ రోబోను లాంచ్ చేసిన కాసేపటికే ప్రపంచవ్యాప్తంగా దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం కొన్ని రోజుల్లోనే 13,000కు పైగా యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయని సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో రోబోలు కేవలం యంత్రాలుగా కాకుండా, మనుషుల దైనందిన జీవితంలో ఒక తెలివైన భాగస్వామిగా మారుతాయని యుబిటెక్ వ్యవస్థాపకుడు జేమ్స్ జౌ ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
UWORLD U1
UBTech
Humanoid Robot
China AI Technology
Emotional AI
Smart Companion Robot

More Telugu News