ఫేస్‌బుక్ కామెంట్‌కు కిడ్నాప్, హత్యాయత్నం.. వైసీపీ నేతలపై హోంమంత్రి అనితకు బాధితుడి ఫిర్యాదు

Vangalapudi Anitha receives complaint against YSRCP leaders over kidnapping and murder attempt
  • ఫేస్‌బుక్ కామెంట్‌పై భూమన అనుచరులు కిడ్నాప్ చేశారని బాధితుడి ఆరోపణ
  • నాలుక కోసి, నరాలు కట్ చేసి చంపేందుకు యత్నించారని ఫిర్యాదు
  • సజ్జల ఫోన్‌తో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారని ఆవేదన
  • టీడీపీ గ్రీవెన్స్‌లో హోంమంత్రి అనితకు బాధితుడు పత్తి మణి అర్జీ
  • తనపైనే అక్రమ కేసులు పెట్టి, కుటుంబాన్ని వేధించారని ఆరోపణ
ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ కామెంట్‌కు ప్రతిగా తనను కిడ్నాప్ చేసి, చంపేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఓ బాధితుడు ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట మండలం మన్నూరు గ్రామానికి చెందిన పత్తి మణి, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో హోంమంత్రితో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.డి. నజీర్‌కు తన గోడును విన్నవించారు.

బాధితుడు పత్తి మణి తెలిపిన వివరాల ప్రకారం, 2023 జూన్ 9న నాటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, "నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌లను తిరుపతిలో అడుగుపెట్టనివ్వం" అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన తాను.. "ఇది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు... మీరు నందలూరు నుంచి తిరుపతి వెళ్లలేదా?" అని కామెంట్ పెట్టినట్టు వెల్లడించారు. ఈ కామెంట్‌ను మనసులో పెట్టుకున్న భూమన అనుచరుడు రాజు మరికొందరితో కలిసి జూన్ 11న రాజంపేటలోని హరిత హోటల్ వద్ద తనపై దాడి చేసి, బలవంతంగా కారులో కిడ్నాప్ చేశారని మణి ఆరోపించారు.

కారులోనే తన నాలుక కోసి, చేతి నరాలు కట్ చేసి, కళ్లపై రాళ్లతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి చేస్తున్న సమయంలో నిందితులు నాటి ఎమ్మెల్యే భూమనకు, ఆయన కుమారుడికి వీడియో కాల్ చేసి చూపించగా.. అవతలి నుంచి "వీడిని బాగా కొట్టి, చంపేసి అలిపిరి అడవిలో పారేయండి" అని ఆదేశాలు ఇచ్చారని మణి సంచలన ఆరోపణలు చేశారు. అయితే, పోలీసులు తమను వెతుకుతున్నారని తెలిసి నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, చిట్వేలి వద్ద పోలీసులు వారిని పట్టుకుని తనను రక్షించారని తెలిపారు.

అయితే అసలు కథ ఇక్కడే మొదలైందని, నిందితులను మన్నూరు పోలీస్ స్టేషన్‌కు తరలించగానే నాటి వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి డీఎస్పీకి ఫోన్ చేశారని, దీంతో నిందితులకు వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి, రాత్రి 2 గంటలకు పోలీస్ సెక్యూరిటీతో తిరుపతికి పంపించేశారని మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత, చావుబతుకుల మధ్య ఉన్న తనపైనే పోలీసులు అక్రమ కేసులు పెట్టారని, తన భార్యను, 3 ఏళ్ల కుమారుడిని పోలీస్ స్టేషన్‌లో 4 గంటల పాటు అక్రమంగా నిర్బంధించారని వాపోయారు. ఈ అన్యాయంపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన హోంమంత్రిని కోరారు.
Vangalapudi Anitha
Bhumana Abhinay Reddy
Sajjala Ramakrishna Reddy
Pathi Mani kidnapping case
YSRCP leaders allegations
Facebook comment assault

More Telugu News