పెళ్లికి నిరాకరించిందని దారుణం: ప్రియురాలిని కిడ్నాప్ చేసి... కారులో ఆత్మాహుతి
- కర్ణాటక హైవేపై కారులో పేలుడు.. యువకుడు సజీవదహనం
- ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమని పోలీసుల వెల్లడి
- యువతిని కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు ఆరోపణలు
- పేలుడుకు ముందు కారు నుంచి బయటపడ్డ యువతి, డ్రైవర్
మృతుడిని ఉత్తర కన్నడ జిల్లా అంకోలాకు చెందిన నాగేంద్రగా గుర్తించారు. గాయపడిన రమ్య ఉల్లాస్ (23) బెంగళూరులోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. వీరిద్దరూ పక్కపక్క గ్రామాలకు చెందినవారే. పోలీసుల కథనం ప్రకారం, నాగేంద్ర, రమ్య గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని నాగేంద్ర అడుగుతుండగా... ఇటీవల రమ్య అతడికి దూరంగా ఉంటోంది.
శనివారం ఉదయం బెంగళూరులోని ఆమె నివాసానికి వెళ్లిన నాగేంద్ర, కత్తితో బెదిరించి బలవంతంగా ఓ క్యాబ్‌లో అంకోలాకు తీసుకెళ్లాడు. రమ్య స్నేహితురాలు సమాచారం అందించడంతో పోలీసులు వాహనాన్ని ట్రాక్ చేయడం ప్రారంభించారు. పోలీసులు క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేయడంతో ఆగ్రహానికి గురైన నాగేంద్ర, ఇద్దరం కలిసే చనిపోదామంటూ రమ్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తల, చేతులకు గాయాలయ్యాయి.
పరిస్థితిని గమనించి భయాందోళనకు గురైన డ్రైవర్, శిర తాలూకాలోని కళ్లంబెళ్ల వద్ద కారును నిలిపివేశాడు. వెంటనే రమ్య, డ్రైవర్ ప్రవీణ్ కారు నుంచి బయటకు దూకేశారు. ఆ తర్వాతి కొద్ది క్షణాలకే నాగేంద్ర తన వద్ద ఉన్న ముడి పేలుడు పదార్థాలను పేల్చుకోవడంతో కారులో మంటలు చెలరేగి అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు పెట్రోల్ బాంబు లేదా నాటు బాంబును ఉపయోగించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
రమ్యను చికిత్స నిమిత్తం తుమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తుమకూరు ఎస్పీ అశోక్ కేవీ తెలిపారు. ఈ పేలుడు కారణంగా బెంగళూరు-పుణే జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.