APAIMS 2.0తో ఎరువుల బ్లాక్ మార్కెట్‌కు చెక్: అచ్చెన్నాయుడు

Atchannaidu says APAIMS will check fertilizer black market
  • కొత్త విధానం ద్వారా ఇప్పటి వరకు 2.97 లక్షల మంది రైతులకు ఎరువులు పంపిణీ చేశామన్న అచ్చెన్న
  • అర్హులైన ప్రతి రైతుకు సమాన అవకాశం కల్పిస్తున్నామని వెల్లడి
  • టమాటా ధరలు పడిపోయాయనే ప్రచారంలో నిజం లేదన్న మంత్రి

రాష్ట్రంలో ఎరువుల పంపిణీని పూర్తి పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా తెచ్చిన APAIMS 2.0 (Andhra Pradesh Agricultural Inputs Management System) పోర్టల్ ద్వారా ఎరువుల అక్రమ మళ్లింపులకు, బ్లాక్ మార్కెట్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేస్తున్నామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 


ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, కొత్త విధానం ద్వారా ఇప్పటివరకు ఏకంగా 2.97 లక్షల మంది నిజమైన రైతులకు నేరుగా ఎరువులను పంపిణీ చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిన నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు 48,588 మెట్రిక్ టన్నుల యూరియా, అలాగే 12,874 మెట్రిక్ టన్నుల డీఏపీ పంపిణీ అయిందన్నారు. రైతులు సాగు చేసే పంట, వారి భూమి విస్తీర్ణం ఆధారంగా ఆన్‌లైన్ లో అవసరమైన మేరకే ఎరువులను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.


ఎరువుల నిల్వలు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి? సరఫరా ఎలా జరుగుతోంది? అనే విషయాలపై రియల్-టైమ్ పర్యవేక్షణ జరుగుతోందని అచ్చెన్నాయుడు తెలిపారు. కౌలు రైతులతో సహా అర్హులైన ప్రతి ఒక్క రైతుకూ సమాన అవకాశం కల్పిస్తున్నామని, ఒకవేళ ఎరువుల సరఫరాలో ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 155251 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. 


రాష్ట్రంలో టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి కొట్టిపారేశారు. మార్కెట్ యార్డ్ గణాంకాల ప్రకారం టమాటా రేట్లు స్థిరంగానే ఉన్నాయన్నారు. అలాగే 'జైన్ మ్యాంగో పల్ప్ యూనిట్' మూతపడిందంటూ జరుగుతున్న ప్రచారం కూడా పచ్చి అబద్ధమని, రైతులెవ్వరూ ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు.

Atchannaidu
APAIMS 2.0
Andhra Pradesh Fertilizer Distribution
Urea and DAP Supply AP
AP Agriculture Department
Tomato Prices Andhra Pradesh

More Telugu News