ఇస్లామాబాద్ శివారులో నడుస్తున్నట్లు అనిపించకూడదు: 'ఆజాన్'ను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్న డెన్మార్క్
- డెన్మార్క్‌లో మసీదుల నుంచి వినిపించే అజాన్‌పై నిషేధం యోచన
- దీనిపై దేశవ్యాప్త నిషేధం కోసం న్యాయ సమీక్షకు ఆదేశం
- ఆజాన్‌పై నిషేధానికి మూడోసారి డెన్మార్క్ ప్రయత్నం
ఈ విషయాన్ని దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మోర్టెన్ బోడ్స్కోవ్ వెల్లడించారు. "డెన్మార్క్ వీధుల్లో నడుస్తుంటే ఇస్లామాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నామనే భావన కలగకూడదు" అని ఆయన వ్యాఖ్యానించారు. డెన్మార్క్ పైకప్పుల వెలుపల అజాన్ వినిపించాల్సిన అవసరం లేదని, ఇక్కడ దానికి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఇస్లాం ప్రభావం పెరుగుతోందని ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అజాన్‌పై నిషేధం విధించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం ఇది మూడోసారి. గతంలో 2020, 2025లలోనూ ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి. ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ నేతృత్వంలోని సోషల్ డెమోక్రటిక్ ప్రభుత్వం ఇప్పటికే ఐరోపాలోనే అత్యంత కఠినమైన వలస విధానాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బురఖా, నిఖాబ్ వంటి ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రధారణపై ఇప్పటికే నిషేధం విధించింది.
అయితే, ఈ ప్రతిపాదిత నిషేధం రాజ్యాంగపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. డెన్మార్క్ రాజ్యాంగం పౌరులందరికీ మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ప్రస్తుతం కోపెన్హాగన్ వంటి నగరాల్లో స్థానిక నిబంధనల మేరకు లౌడ్‌స్పీకర్ల వినియోగంపై ఇప్పటికే పరిమితులు ఉన్నాయి. దేశంలోని అతి తక్కువ మసీదులు మాత్రమే ప్రస్తుతం బహిరంగంగా అజాన్ ఇస్తున్నాయి.
దాదాపు 60 లక్షల జనాభా కలిగిన డెన్మార్క్‌లో సుమారు 2,70,000 మంది ముస్లింలు నివసిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం న్యాయ సమీక్ష నివేదిక కోసం వేచి చూస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.