మూడు రాష్ట్రాల రైతులకు కొత్త ఆశ.. తుంగభద్ర వద్ద రేవంత్‌ కీలక సందేశం

Revanth Reddy key message at Tungabhadra brings new hope for three states farmers
  • తుంగభద్ర నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభం
  • చరిత్రలో నిలిచే ఘట్టమన్న రేవంత్
  • మూడు రాష్ట్రాల రైతులకు ప్రయోజనమని స్పష్టీకరణ
  • జల వివాదాలకు పరిష్కారం కావాలని ఆకాంక్ష
  • కృష్ణా-గోదావరి సమస్యల పరిష్కారమవుతాయని ఆశాభావం
తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ దక్షిణ భారత జలవనరుల చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలోని మునీరాబాద్‌లో నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ ప్రాజెక్టు మూడు రాష్ట్రాల రైతాంగ భవిష్యత్తుకు కొత్త ఆశలు నింపుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం గేట్ల పునరుద్ధరణను కేవలం ఇంజినీరింగ్ విజయంగా చూడలేమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని కరవు ప్రభావిత ప్రాంతాలకు ఇది కీలక మైలురాయిగా మారుతుందని చెప్పారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురంతో పాటు తెలంగాణలోని పాలమూరు ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న నీటి కష్టాలు తనకు బాగా తెలుసన్నారు.

రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశాలు సకాలంలో పరిష్కారం కాకపోవడం వల్ల విలువైన జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు, వివాదాలు పక్కనబెట్టి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

తుంగభద్ర వేదికగా మూడు రాష్ట్రాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని సీఎం తెలిపారు. ఇదే స్ఫూర్తితో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన కీలక అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి చట్టబద్ధంగా రావాల్సిన 10 టీఎంసీల నీరు ఇప్పటికీ రాష్ట్రానికి పూర్తిగా అందడం లేదని పేర్కొన్నారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పరిధిలోని తెలంగాణ రైతులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలు సహకార భావంతో వ్యవహరించాలని కోరిన సీఎం, పరస్పర అవగాహనతో ముందుకు సాగితేనే మూడు రాష్ట్రాల రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు.
Revanth Reddy
Tungabhadra Dam
Crust Gate Restoration
Telangana Karnataka Andhra Pradesh
Rajolibanda Diversion Scheme
River Water Sharing

More Telugu News