ఉక్రెయిన్‌కు భారత సైన్యాన్ని పంపాలని వాన్స్‌ ప్రతిపాదన.. ట్రంప్‌ ఏమన్నారంటే?

JD Vance proposal to send Indian Army to Ukraine what Trump said
  • ఉక్రెయిన్‌లో భారత దళాలపై అమెరికాలో చర్చ
  • జేడీ వాన్స్‌ భారత్‌ పేరును ప్రతిపాదించినట్లు వెల్లడి
  • ప్రతిపాదనను ట్రంప్‌ తిరస్కరించినట్లు పుస్తకంలో ప్రస్తావన
  • "భారతీయులు అలాంటి పని చేయరు" అని ట్రంప్‌ వ్యాఖ్య
  • ఉక్రెయిన్‌పై శాంతి చర్చలకే భారత్‌ మద్దతు
ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల సమయంలో భారత సైన్యాన్ని శాంతి పరిరక్షక దళంగా పంపాలన్న ప్రతిపాదన ఓ దశలో అమెరికా అత్యున్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఆలోచనను అధ్యక్షుడు ట్రంప్‌ వెంటనే పక్కన పెట్టినట్లు తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది.

అమెరికా జర్నలిస్టులు మ్యాగీ హాబర్‌మన్‌, జోనాథన్‌ స్వాన్‌ రాసిన ‘రెజీమ్‌ ఛేంజ్‌: ఇన్‌సైడ్‌ ది ఇంపీరియల్‌ ప్రెసిడెన్సీ ఆఫ్‌ డొనాల్డ్‌ ట్రంప్‌’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్నిరోజులకే వైట్‌హౌస్‌లో జరిగిన కీలక సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.

ఆ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఆసక్తికరమైన సూచన చేసినట్లు పుస్తకం చెబుతోంది. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ అమలైతే అక్కడ శాంతి పరిరక్షణ కోసం యూరప్‌కు వెలుపల ఉన్న దేశాల సైన్యాన్ని వినియోగించవచ్చా? అని ఆయన ప్రశ్నించినట్లు రచయితలు పేర్కొన్నారు. ఆ సందర్భంలో భారత్‌ పేరును కూడా ఆయన ప్రస్తావించినట్లు తెలిపారు.

అయితే ఈ ప్రతిపాదనపై ట్రంప్‌ నవ్వుతూ స్పందించినట్లు పుస్తకంలో ఉంది. ‘‘భారతీయులు అలా చేయలేరు. అలాంటి వ్యవహారాల కోసం ఖర్చు పెట్టరు’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు రచయితలు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీతో తనకు ఉన్న స్నేహాన్ని కూడా ట్రంప్‌ ప్రస్తావించినట్లు పుస్తకం వెల్లడించింది.

ఉక్రెయిన్‌ యుద్ధంపై భారత్‌ మొదటి నుంచీ ఒకే విధమైన వైఖరిని కొనసాగిస్తోంది. యుద్ధానికి బదులుగా చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పదేపదే చెబుతోంది. ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని ప్రధాని మోదీ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే ఉక్రెయిన్‌కు భారత సైన్యాన్ని పంపే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.

అయినా ఈ అంశం భారత్‌లో కూడా చర్చకు వచ్చింది. 2025 ఏప్రిల్‌లో కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ మాట్లాడుతూ కాల్పుల విరమణ అమలైతే పరిమిత స్థాయిలో శాంతి దళాలను పంపే అవకాశాన్ని పరిశీలించవచ్చని అభిప్రాయపడ్డారు. యూరప్‌ వెలుపల ఉన్న దేశాలు కూడా శాంతి పరిరక్షణలో పాత్ర పోషించవచ్చని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో భారత సైన్యానికి విశేష అనుభవం ఉంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దక్షిణ సూడాన్‌, సోమాలియా, లెబనాన్‌ వంటి దేశాల్లో భారత బలగాలు గతంలో సేవలందించాయి. అయినప్పటికీ ఉక్రెయిన్‌ విషయంలో అలాంటి ప్రతిపాదన ఎప్పుడూ చర్చకు రాలేదు.
Go Back to Shorts
Donald Trump
JD Vance
Indian Army
Ukraine War
Peacekeeping Force
Narendra Modi

More Telugu News