వచ్చే దశాబ్దానికి అదానీ గ్రూప్ త్రిసూత్ర ప్రణాళిక

  • వచ్చే దశాబ్దం కోసం త్రిసూత్ర ప్రణాళికను ప్రకటించిన గౌతమ్ అదానీ
  • పని విధానాన్ని సరళతరం చేయడం, కాంట్రాక్టర్లతో కొత్త భాగస్వామ్యం
  • దాదాపు 4 లక్షల మంది కార్మికుల ఆత్మగౌరవానికి పెద్దపీట
  • దేశ నిర్మాణమే లక్ష్యమంటూ భవిష్యత్ విజన్‌ను వివరించిన అదానీ
  • అదానీ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల విస్తరణ
దేశ నిర్మాణానికి దోహదపడే మౌలిక సదుపాయాలను నిర్మించడం, సమాజంలోని ప్రతి స్థాయిలో మానవ గౌరవాన్ని కాపాడే సంస్థలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన 34వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ప్రసంగించిన ఆయన, వచ్చే దశాబ్ద కాలంలో సంస్థ విజన్‌ను అమలు చేసేందుకు మూడు కీలకమైన పునాది సూత్రాలను ఆవిష్కరించారు. భవిష్యత్తులో మరింత ప్రతిష్ఠ‌, క్రమశిక్షణ, కార్యదక్షత అవసరమని ఆయన పేర్కొన్నారు.

త్రిసూత్ర ప్రణాళిక ఇదే..
మొదటిది.. తమ పని విధానాన్ని సరళతరం చేస్తున్నట్లు గౌతమ్ అదానీ తెలిపారు. "అధికార యంత్రాంగాన్ని తగ్గించడానికి, జవాబుదారీతనాన్ని పదును పెట్టడానికి, నిర్ణయాలను అమలుకు మరింత చేరువ చేయడానికి మా ప్రధాన కార్యాలయాలు, సైట్‌లలో మూడు-స్థాయుల నిర్మాణాన్ని అమలు చేస్తున్నాం. సంస్థలో ప్రతి పాత్ర, ప్రతి ప్రక్రియ విలువను జోడించేలా ఉండాలి. ప్రధానం కాని కార్యకలాపాలను మా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (GCCs) లేదా నామినేటెడ్ భాగస్వాములకు బదిలీ చేస్తాం" అని ఆయన వివరించారు.

రెండవది.. కాంట్రాక్టర్లతో తమ పని విధానాన్ని మార్చుకుంటున్నట్లు అదానీ వెల్లడించారు. వారిని దేశ నిర్మాణంలో దీర్ఘకాలిక భాగస్వాములుగా చూస్తామన్నారు. "వారి వృద్ధికి మద్దతునిచ్చే, వారి లాభాలను కాపాడే, మా ఆసక్తులతో వారి ఆసక్తులను ఏకీకృతం చేసే లోతైన, స్థిరమైన భాగస్వామ్యాలను నిర్మిస్తాం. ఇది ప్రాజెక్టులను మరింత వేగంగా, నాణ్యతతో పూర్తి చేయడానికి మాకు సహాయపడుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.

మూడవది.. అత్యంత ముఖ్యమైనది, కార్మికుల ఆత్మగౌరవానికి తమ పరివర్తనలో పెద్దపీట వేస్తున్నట్లు అదానీ నొక్కి చెప్పారు. "మా సొంత, కాంట్రాక్టర్ల సిబ్బంది కలిపి దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నారు. వీరిలో 85 శాతం మంది మా సైట్లలో క్షేత్రస్థాయిలో పనిచేసేవారే. మా ప్రణాళికలను వాస్తవరూపంలోకి తెచ్చేది వారే. ప్రతి కార్మికుడికి గౌరవం లభించేలా మేము కట్టుబడి ఉన్నాం. పరిశుభ్రమైన జీవన పరిస్థితులు, పరిశుభ్రమైన ఆహారం, వైద్య సహాయం, సురక్షితమైన పని వాతావరణం, సమయానికి సరైన వేతనాలు చెల్లించడం ఇందులో భాగం" అని ఆయన పేర్కొన్నారు.

అదానీ ఫౌండేషన్ సేవలు
సంస్థ వృద్ధితో పాటు అదానీ ఫౌండేషన్ కార్యకలాపాలు కూడా తమ లక్ష్యాలకు కేంద్రంగా ఉన్నాయని గౌతమ్ అదానీ తెలిపారు. డాక్టర్ ప్రీతి అదానీ సమర్థ నాయకత్వంలో ఫౌండేషన్ 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందని, ప్రస్తుతం 22 రాష్ట్రాల్లోని 7,000 గ్రామాల్లో దాదాపు కోటి మందికి సేవలు అందిస్తోందని చెప్పారు. బీహార్‌లో గ్రామీణ కంటి సంరక్షణ కోసం ఒక ప్రతిష్టాత్మక మోడల్‌ను నిర్మిస్తున్నామని, అదానీ యూనివర్సిటీ, భుజ్‌లోని గుజరాత్ అదానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన వైద్య విద్య, సేవల్లో శ్రేష్ఠతా కేంద్రాలను సృష్టిస్తున్నామని తెలిపారు. అహ్మదాబాద్, ముంబైలలో 1000 పడకల మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలతో కూడిన 'అదానీ హెల్త్ సిటీ'లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక నైపుణ్యాభివృద్ధిలో భాగంగా గ్రామీణ భారతదేశంలో 1.25 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తున్నట్లు, గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో 'కర్మ ఉత్సవ్' కార్యక్రమం ద్వారా స్థానిక ఉపాధిని ప్రోత్సహిస్తున్నట్లు గౌతమ్ అదానీ వివరించారు. "భవిష్యత్తు భారతావని నిర్మాణానికి మేము సిద్ధంగా ఉన్నాం" అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Gautam Adani
Adani Group AGM
Three pillar strategy
Adani Foundation initiatives
Adani Health City
Infrastructure development India

More Telugu News