భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ
- పుట్టిన గడ్డపై ప్రేమతో అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ
- భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలన్నదే తన చివరి కోరిక అని వెల్లడి
- బాపట్ల కలెక్టరేట్లో భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వృద్ధురాలు
- దరఖాస్తును కేంద్ర హోంశాఖకు పంపుతామన్న కలెక్టర్ వినోద్‌కుమార్
- అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరసత్వం మంజూరు చేస్తామని వెల్లడి
వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ (94) తన చివరి కోరికను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె కుమారుడు డాక్టర్ బుచ్చయ్య చౌదరి చాలాకాలం క్రితం అమెరికాలోని వర్జీనియాలో స్థిరపడ్డారు. భర్త నాగభూషణం మరణానంతరం మహాలక్ష్మమ్మ కూడా అమెరికా వెళ్లి, 2000 సంవత్సరంలో అక్కడి పౌరసత్వం పొందారు. అయితే, మాతృభూమిపై ఉన్న ప్రేమతో ఆమె 2018లో తన కుమారుడి కుటుంబంతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. గత ఎనిమిదేళ్లుగా ఆమె తన సొంతూరైన చింతగుంపలలోనే నివసిస్తున్నారు.
"నా కట్టె ఇక్కడే కాలాలి, పుట్టిన ఊరి మట్టిలోనే కలిసిపోవాలి" అన్నది మహాలక్ష్మమ్మ చివరి కోరిక. ఈ నేపథ్యంలో ఆమె తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడంతో, వాటిని సరిదిద్ది తాజాగా మళ్లీ దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆమె నిన్న బాపట్ల కలెక్టరేట్‌కు హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ పి. వినోద్‌కుమార్ సమక్షంలో మహాలక్ష్మమ్మ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, దేశ చట్టాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మమ్మ ప్రమాణ పత్రంతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర హోంశాఖకు పంపిస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఈ దరఖాస్తును అమెరికా ఎంబసీకి పంపుతుందని, అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే మహాలక్ష్మమ్మకు భారత పౌరసత్వం లభిస్తుందని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయితే, తన మాతృభూమిలో భారత పౌరురాలిగా జీవించాలన్న మహాలక్ష్మమ్మ చిరకాల స్వప్నం నెరవేరుతుంది.