కేవలం 299 డాలర్లకే మెటా కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు గట్టి పోటీ!

Meta launches new AI smart glasses for 299 dollars to compete with Google and Apple
  • సొంత బ్రాండ్‌తో తక్కువ ధరలో మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్
  • దిగ్గజ సంస్థలకు పోటీగా సరసమైన వేరబుల్స్‌ 
  • ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేసుకునే సదుపాయం 
  • మెరా వల్ల వచ్చే ప్రైవసీ సమస్యల నివారణ ప్రత్యేక ఇండికేటర్ లైట్‌
టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్ వేరబుల్స్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. గూగుల్, స్నాప్ వంటి ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ 299 డాలర్ల (సుమారు రూ. 25,000) ప్రారంభ ధరతో సొంత బ్రాండ్‌పై ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎస్సిలార్ లూక్సోటికా  భాగస్వామ్యంతో జూన్ 23న ఈ సరికొత్త మెటా గ్లాసెస్‌ను కంపెనీ ప్రకటించింది.

గతంలో రేబాన్, ఓక్లీ వంటి లగ్జరీ బ్రాండ్లతో కలిసి పనిచేసిన మెటా.. ఈసారి ప్రీమియం డిజైనర్ బ్రాండింగ్ లేకుండానే తక్కువ ధరకే వీటిని అందిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేబాన్ మెటా మోడల్స్ (379 డాలర్లు) ధర కంటే ఇవి దాదాపు 80 డాలర్లు తక్కువ కావడం గమనార్హం.

ఈ కొత్త లైనప్‌లో విభిన్న శైలి, రంగులతో పాటు ప్రధానంగా మూడు రకాల ఫ్రేమ్ ఆప్షన్లను మెటా పరిచయం చేసింది. బేస్ మోడల్స్ అయిన 'అడ్వెంచరర్', 'ఫ్యూరీ' వేరియంట్లు 299 డాలర్ల ధరకే లభిస్తుండగా, ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ కైలీ జెన్నర్‌తో కలిసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రీమియం మోడల్ 'స్టార్‌ఫైర్' ధరను 399 డాలర్లుగా నిర్ణయించారు.

ఈ స్మార్ట్ గ్లాసెస్ ఫీచర్ల విషయానికొస్తే

కెమెరా, ఆడియో: 12-మెగాపిక్సెల్ కెమెరా, ఓపెన్-ఈర్ స్పీకర్లు.
మెటా ఏఐ: చేతులతో పనిలేకుండా వాయిస్ కమాండ్స్ ద్వారా ప్రశ్నలు అడిగే సదుపాయం.
లైవ్ స్ట్రీమింగ్: ఇన్‌స్టాగ్రామ్ లేదా వాట్సాప్‌కు నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేసుకునే వీలు.
బ్యాటరీ బ్యాకప్: ఎనిమిది గంటల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్. అలాగే ఇవి ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లకు కూడా సపోర్ట్ చేస్తాయి.

2023 నుండి ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా రేబాన్ మెటా గ్లాసెస్ అమ్ముడుపోగా, ఆ విజయంతో ఈ సరికొత్త తక్కువ ధర వేరియంట్లను మెటా మార్కెట్లోకి తెచ్చింది.

ముదురుతున్న మార్కెట్ పోటీ
మెటా సరికొత్త లాంచ్‌తో స్మార్ట్ గ్లాసెస్ రంగంలో పోటీ ఒక్కసారిగా వేడెక్కింది. గూగుల్ సంస్థ శాంసంగ్, వార్బీ పార్కర్ భాగస్వామ్యంతో 2026 చివరలో తన స్వంత ఏఐ గ్లాసెస్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతుండగా, స్నాప్ సంస్థ అడ్వాన్స్‌డ్ ఏఆర్ స్పెక్టకల్స్ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు యాపిల్ సంస్థ కూడా రాబోయే సంవత్సరాల్లో ఈ మార్కెట్లోకి అడుగుపెట్టే యోచనలో ఉంది. అయితే, వేరబుల్స్ రంగంలో ఇన్నోవేషన్ పెంచడమే తమ లక్ష్యమని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు.

లభ్యత మరియు ప్రైవసీ రక్షణ
ఈ మెటా గ్లాసెస్ ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని దేశాలలో వివిధ కలర్ కాంబినేషన్లలో అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇందులో బిల్ట్-ఇన్ కెమెరా ఉండటంపై ప్రైవసీ నిపుణులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై మెటా స్పందిస్తూ.. ఇందులో ఫేషియల్ రికగ్నిషన్ (ముఖాన్ని గుర్తించే) సాంకేతికత లేదని, కెమెరా ఆన్ అయినప్పుడు ఇతరులకు తెలిసేలా స్పష్టమైన ఇండికేటర్ లైట్ వెలుగుతుందని, తద్వారా భద్రతా ప్రమాణాలు పాటించామని తెలిపింది.
Go Back to Shorts
Meta
Meta AI Smart Glasses
Mark Zuckerberg
EssilorLuxottica
Smart Wearables
Kylie Jenner Starfire

More Telugu News