ఎలాన్ మస్క్ తర్వాత అత్యధిక వేతనం.. ఎవరీ శంఖ్ మిత్రా?
- అమెరికాలో భారత సంతతి సీఈఓ శంఖ్ మిత్రా సంచలనం
- సుమారు రూ.7,789 కోట్ల భారీ వేతన ప్యాకేజీతో రికార్డు
- వెల్‌టవర్ సీఈఓగా కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గుర్తింపు
- ఈ ప్యాకేజీలో 99 శాతం షరతులతో కూడిన స్టాక్ గ్రాంట్లేనని వెల్లడి
ప్యాకేజీలో 99 శాతం స్టాక్ గ్రాంట్లే
ప్రముఖ పత్రిక 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం ప్రకారం శంఖ్ మిత్రా ప్యాకేజీలో 99 శాతం స్టాక్ గ్రాంట్ల రూపంలోనే ఉంది. అక్టోబర్‌లో ఆయనకు 789 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ కేటాయించారు. అయితే, ఈ ప్యాకేజీకి కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. కంపెనీలో ఆయన 2031 వరకు కొనసాగితేనే సగం షేర్లను పొందుతారు. మిగిలిన సగం పొందాలంటే, ఐదేళ్ల వ్యవధిలో వెల్‌టవర్ మార్కెట్ విలువ 45 శాతం పెరగాలి. అంతేకాకుండా పలు స్టాక్ ఇండెక్స్‌ల కంటే కంపెనీ షేర్ల పనితీరు మెరుగ్గా ఉండాలి. ఆయన నాయకత్వంలో కంపెనీ వృద్ధి సాధిస్తేనే ఈ భారీ మొత్తం ఆయనకు దక్కుతుంది. ఇది ఆయన గత ప్యాకేజీ కంటే 40 శాతం అధికం కావడం గమనార్హం.
భారత్‌లో చదువుకుని.. అమెరికాలో అద్భుతాలు
భారత్‌లోనే పుట్టి పెరిగిన శంఖ్ మిత్రా, జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, కొలంబియా బిజినెస్ స్కూల్‌లో అప్లైడ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌లో ఎంబీఏ పట్టా పొందారు.
తన కెరీర్‌ను ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌లో ప్రారంభించి, అక్కడ ఐదేళ్లకు పైగా పనిచేశారు. అనంతరం ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటాడెల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్, మిలీనియం పార్ట్‌నర్స్ వంటి ప్రముఖ సంస్థల్లో రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ విభాగాల్లో కీలక పాత్రలు పోషించారు.
2016లో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా వెల్‌టవర్‌లో చేరిన ఆయన, అనతికాలంలోనే తన ప్రతిభతో ఉన్నత స్థానాలకు ఎదిగారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేసి, 2020 అక్టోబర్‌లో కంపెనీకి సీఈఓగా నియమితులయ్యారు.
డేటా ఆధారిత పెట్టుబడులు, వ్యూహాత్మక కొనుగోళ్లతో కంపెనీని లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన నాయకత్వంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ భారీ ప్యాకేజీని అందించారు. అమెరికాలో ఒక ప్రధాన రియల్ ఎస్టేట్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న అతి కొద్ది మంది భారత సంతతి వ్యక్తులలో శంఖ్ మిత్రా ఒకరిగా నిలిచారు.