ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా
- వ్యక్తిగత కారణాలుగా పేర్కొన్న జైన్
- రాజీనామా ఆమోదించిన రైల్వే మంత్రిత్వ శాఖ
- జూలై 20 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి
- ఆయన హయాంలోనే ఐఆర్‌సీటీసీకి నవరత్న హోదా
ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జూన్ 22న తమకు లేఖ అందినట్లు ఐఆర్‌సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. బాధ్యతల బదిలీ ప్రక్రియ సజావుగా సాగేందుకు జైన్ జూలై 20వ తేదీ వరకు సీఎండీగా కొనసాగుతారు. తదుపరి సీఎండీ అదనపు బాధ్యతలకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
1990 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) అధికారి అయిన సంజయ్ జైన్, 2024 ఫిబ్రవరి 14న ఐఆర్‌సీటీసీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలంలో సంస్థ గణనీయమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ ‘మినీరత్న’ హోదా నుంచి ‘నవరత్న’ స్థాయికి ఎదగడంతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో 'షెడ్యూల్-బి' నుంచి 'షెడ్యూల్-ఎ'కు ఉన్నతి సాధించింది.
"నా పదవీకాలంలో నాకు సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐఆర్‌సీటీసీ భవిష్యత్తులో మరింత వృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నాను" అని జైన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.