రివ్యూలు ఎలా ఉన్నా ప్రేక్షకులే ఈ సినిమాను భుజాలపై మోశారు: 'పెద్ది' ఈవెంట్ లో రామ్ చరణ్ భావోద్వేగం

Ram Charan emotional at Peddi event says audience carried film despite reviews
  • హైదరాబాదులో పెద్ది సక్సెస్ మీట్
  • ఇంట్లో కుమార్తె క్లీంకార కూడా 'పెద్ది' అనే పిలుస్తోందని చరణ్ వెల్లడి
  • దర్శకుడు బుచ్చిబాబు, గురువు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
  • రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన గ్లోబల్ స్టార్
‘పెద్ది’ చిత్రం సాధించిన అపూర్వ విజయం తన జీవితాన్నే మార్చేసిందని, గతంలో ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ ఇంతటి తృప్తిని, ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. 'పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్' పేరిట హైదరాబాద్ లో నిర్వహించిన ‘పెద్ది’ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా విజయం తనకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చిందని, ప్రేక్షకులు చూపించిన ప్రేమ తన గుండెల్లో నిలిచిపోతుందని తెలిపారు. ఇంట్లో తన కుమార్తె క్లీంకార కూడా ‘నాన్నా’ అని పిలవడం మానేసి, ‘ఏయ్ పెద్ది’ అని పిలుస్తోందని చరణ్ భావోద్వేగంతో చెప్పారు. "ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు రామ్ చరణ్‌ను మర్చిపోయి పెద్దన్ననే గుర్తుపెట్టుకుంటారేమోనని భయమేస్తోంది" అని చరణ్ సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ విజయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ రామ్ చరణ్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. "ఇంతటి అందమైన జ్ఞాపకాన్ని, అనుభూతిని ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో వినయం కలిగిన బుచ్చిబాబును నాకు పరిచయం చేసిన నా గురువు, నాకెంతో ఇష్టమైన వ్యక్తి సుకుమార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఎప్పుడైనా డల్‌గా ఉన్నప్పుడు నాన్నగారితో కూడా పంచుకోలేని విషయాలను సుకుమార్ గారితో మాట్లాడతాను. నా జీవితంలో ఆయన ఒక అన్నయ్యలా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని చరణ్ పేర్కొన్నారు.

తొలి సినిమా అయినా, ఎంతో అనుభవం ఉన్న నిర్మాతలా బలమైన స్తంభంలా నిలిచిన సతీష్ కిలారుకు, అద్భుతమైన విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌పై ప్రశంసలు కురిపించారు. "సెకండాఫ్‌కు ప్రాణం పోసి, దాన్ని జనం గుండెల్లోకి తీసుకెళ్లిన ఘనత రెహమాన్ గారి నేపథ్య సంగీతానిదే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే" అని అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ‘పెద్ది’ ప్రపంచాన్ని అద్భుతంగా సృష్టించారని కొనియాడారు.

ప్రేక్షకుల ఆదరణ గురించి మాట్లాడుతూ చరణ్ ఉద్వేగానికి లోనయ్యారు. "ఠాగూర్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘తెలుగు ప్రజలు ఎవరినీ అంత సులభంగా ఇష్టపడరు. ఒక్కసారి ఇష్టపడితే చనిపోయే వరకు గుర్తుపెట్టుకుంటారు’ అని. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు దాన్ని నిరూపించారు. కొందరు రివ్యూలు అటూఇటుగా రాసినా, ఇది మా సినిమా కాదు, నిజమైన ప్రేక్షక దేవుళ్ల సినిమా అని మీరే నిరూపించారు. మీ భుజాలపై ఈ సినిమాను మోశారు. ఫోన్లు తీసి మంచి రివ్యూలు ఇచ్చిన ప్రతి ప్రేక్షకుడికి సెల్యూట్ చేస్తున్నాను" అని అన్నారు.

ఈ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, తన బాబాయ్ పవన్ కల్యాణ్, మంత్రి దుర్గేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కథానాయిక జాన్వీ కపూర్‌కు, ప్రత్యేక గీతంలో నటించిన శ్రుతి హాసన్‌కు, సహ నిర్మాత ఇషాన్‌కు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు.
Go Back to Shorts
Ram Charan
Peddi movie success meet
Buchi Babu Sana
AR Rahman Peddi BGM
Ram Charan emotional speech
Peddi mega blockbuster event

More Telugu News