ఐపీఎల్ క్రికెటర్ పై కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు
- ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌పై యువతి ఫిర్యాదు
- పెళ్లి పేరుతో నమ్మించి సహజీవనం చేశాడని ఆరోపణ
- కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది
- ఆరోపణలను ఖండించిన అభిషేక్.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
- రిషభ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ పోరెల్
పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలు తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గత మూడేళ్లుగా తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఏడాదిన్నర క్రితం వారి మధ్య విభేదాలు మొదలయ్యాయని, అప్పట్లో ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా కేసు నమోదు కాలేదని తెలిసింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని 23 ఏళ్ల అభిషేక్ పోరెల్ ఖండించినట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో హూగ్లీ (రూరల్) ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ స్వయంగా మోగ్రా పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్థానిక అధికారులతో కేసు వివరాలపై చర్చించారు. ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు ధ్రువీకరించారు. హూగ్లీ జిల్లాలోని చందన్‌నగర్‌కు చెందిన అభిషేక్, ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో రిషభ్ పంత్ స్థానంలో అభిషేక్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి విఫలమైనా, ఫ్రాంచైజీ అతడిని అట్టిపెట్టుకుంది. గత సీజన్‌లో మాత్రం యువ వికెట్ కీపర్‌గా రాణించి జట్టు నమ్మకాన్ని గెలుచుకున్నాడు.