రాష్ట్రపతి చేతుల మీదుగా 'పద్మశ్రీ' అందుకున్న రోహిత్ శర్మ

Rohit Sharma receives Padma Shri award from the President
  • రాష్ట్రపతి భవన్‌లో అవార్డు ప్రదానం
  • క్రికెట్‌కు చేసిన విశేష సేవలకు గానూ ఈ గౌరవం
  • భార్య రితికా సజ్దేతో కలిసి హాజరైన రోహిత్ శర్మ
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందుకున్నాడు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 'హిట్ మ్యాన్' ఈ గౌరవాన్ని స్వీకరించాడు. గత మే నెలలో జరిగిన తొలి విడత కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన రోహిత్, రెండో విడతలో తన భార్య రితికా సజ్దేతో కలిసి విచ్చేసి ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.

దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్‌ రంగానికి అందించిన విశేష సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రోహిత్‌ను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్, మూడు ఫార్మాట్లలోనూ అద్వితీయమైన రికార్డులను నెలకొల్పాడు. టెస్టుల్లో 4,300 పైగా పరుగులు (12 సెంచరీలు), వన్డేల్లో 11,500 కంటే ఎక్కువ పరుగులు (33 సెంచరీలు), టీ20ల్లో 4,200 పైగా పరుగులు సాధించి తనదైన ముద్ర వేశాడు. అతడి సారథ్యంలోనే భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలను కైవసం చేసుకుంది.

ఈ మహోన్నత ఘట్టం నేపథ్యంలో బీసీసీఐ, టీమిండియా రోహిత్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపాయి. "క్రీడా ప్రపంచంలోని ఓ గొప్ప యోధుడికి దక్కిన అత్యున్నత గౌరవం" అని అభివర్ణించాయి. ఈ ఏడాది ఆరంభంలో పద్మ పురస్కారాల ప్రకటన వెలువడినప్పుడు రోహిత్ స్పందిస్తూ, ఇది తనకే కాకుండా తన కుటుంబానికీ గర్వకారణమని, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించిన రోహిత్, 2027 ప్రపంచకప్‌లోనూ ఆడటమే తన లక్ష్యమని చెబుతున్నాడు.
Go Back to Shorts
Rohit Sharma
Padma Shri Award
President Droupadi Murmu
Indian Cricket Team
Ritika Sajdeh

More Telugu News