టీమిండియాలోకి మరో కొత్త కుర్రాడు.. నితీశ్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే

Suryansh Shedge replaces Nitish Reddy in Team India for Ireland and England series
  • గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి దూరం
  • ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల నుంచి ఔట్‌
  • నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపిక
  • సీనియర్ భారత జట్టులో షెడ్గేకు తొలి అవకాశం
  • ఇండియా-ఏ, ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన
భారత క్రికెట్ జట్టుకు గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ముంబై యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేకు తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు కల్పించినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం నితీశ్ ఎడమ తొడ కండరాల్లో అసౌకర్యం ఉన్నట్లు వైద్య బృందానికి తెలియజేశాడు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం నిర్ధారణ కావడంతో అతడికి కొంతకాలం విశ్రాంతి, పునరావాసం అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే రెండు టీ20 సిరీస్‌ల నుంచి అతడిని తప్పించారు.

ఇప్పటికే గాయం కారణంగా హార్దిక్ పాండ్య అందుబాటులో లేకపోవడంతో, నితీశ్ రెడ్డి జట్టులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తాడని భావించారు. ముఖ్యంగా బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా అతడు జట్టుకు బ్యాలెన్స్‌ తీసుకొచ్చే ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే గాయం కారణంగా అతడు టూర్‌కు దూరం కావడం సెలెక్టర్లకు నిరాశ కలిగించింది.

ఇక నితీశ్ స్థానంలో ఎంపికైన 23 ఏళ్ల సూర్యాంశ్ షెడ్గే ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 147 పరుగులు చేయడంతో పాటు బంతితో కూడా రెండు వికెట్లు సాధించాడు. అలాగే 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 251.92 స్ట్రైక్‌రేట్‌తో 131 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

కుడిచేతి బ్యాటర్, మీడియం పేస్ బౌలర్ అయిన షెడ్గే క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా పరుగులు చేయగల ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అతడి ప్రతిభను గుర్తించిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌ల్లో 165 పరుగులు చేసిన షెడ్గే, 2026 సీజన్‌లో 175.55 స్ట్రైక్‌రేట్‌తో 158 పరుగులు నమోదు చేశాడు.

భారత్ జట్టు ముందుగా బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.
Go Back to Shorts
Suryansh Shedge
Nitish Kumar Reddy
Team India
India vs Ireland T20
BCCI
Mumbai Cricket

More Telugu News