లక్నోలో అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న మృతుల చివరి ఫోన్ కాల్స్!

Lucknow Fire Accident Heartbreaking Final Phone Calls of Victims
  • నిన్న లక్నోలోని వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం
  • ఘటనలో 15 మంది మృతి, ఏడుగురికి గాయాలు
  • కాపాడమంటూ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చివరి ఫోన్ కాల్
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఒక వాణిజ్య భవనంలో చెలరేగిన మంటల్లో చిక్కుకుని 15 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులు, యువ ఉద్యోగులే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు తమ చివరి కుటుంబ సభ్యులతో మాట్లాడిన చివరి ఫోన్ కాల్స్, అలాగే ప్రమాదం సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడిన కాల్స్ ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి.

కోల్‌కతాకు చెందిన 30 ఏళ్ల అనామిక సమంత గత మూడేళ్లుగా లక్నోలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం ఆమె తన తల్లి సులేఖతో ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ దారుణం జరిగింది. "ప్రతిరోజూ ఉదయం అనామిక నాకు ఫోన్ చేసేది. అదే మా చివరి సంభాషణ అవుతుందని కలలో కూడా ఊహించలేదు" అని సులేఖ కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాద వార్త తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన లక్నోకు చేరుకుని, మార్చురీలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

కాపాడమంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఆఖరి ఫోన్ కాల్స్

"నన్ను కాపాడు" అని బాధితులు తమ చివరి క్షణాల్లో వేడుకోవడం హృదయవిదారకంగా ఉంది. 3డీ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల ఆదిత్య శ్రీవాస్తవ ప్రాణాలు కోల్పోయే ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి రక్షించమని కోరాడు. కానీ దురదృష్టవశాత్తూ అతడు ఈ ప్రమాదంలో మృతి చెందాడు.

"నాన్నా, నన్ను కాపాడు.. నేను బతుకుతానని అనుకోవడం లేదు, ఇక్కడ ఊపిరాడటం లేదు" అంటూ 23 ఏళ్ల సుఖ్‌మణి సింగ్ తన తండ్రికి చేసిన ఆఖరి ఫోన్ కాల్ అందరినీ కంటతడి పెట్టించింది. యానిమేటర్ కావాలన్న తన కుమారుడి కల తీరకుండానే అనంత వాయువుల్లో కలిసిపోయిందని తండ్రి ప్రభ్‌జోత్ సింగ్ విలపించారు.

ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాద కారణాలపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. భద్రతా లోపాలపై నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు, భవన యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. గాయపడిన బాధితులకు ప్రస్తుతం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
Go Back to Shorts
Lucknow Fire Accident
Aliganj Lucknow
Yogi Adityanath
Uttar Pradesh News
Lucknow Building Fire

More Telugu News