పుణె బిజినెస్‌మ్యాన్‌ మృతి కేసులో ట్విస్ట్‌.. కాబోయే భార్యే లోయలోకి తోసినట్లు అనుమానాలు!

Ketan Agarwal death case twist as police suspect fiancee pushed him into valley
  • పుణెలో యువకుడి మరణం కేసులో సంచలన మలుపు
  • హత్య జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం
  • కాబోయే భార్య, ఆమె ప్రియుడిపై అనుమానాలు
  • జూన్ 14న తొలి హత్యాయత్నం జరిగినట్టు గుర్తింపు!
  • డిజిటల్ ఆధారాలతో కేసు దర్యాప్తులో మలుపు
మహారాష్ట్రలోని పుణె సమీపంలోని లోహగడ్ కోట వద్ద జూన్ 19న 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ లోయలో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఫొటోలు తీస్తుండగా ప్రమాదవశాత్తూ జారి పడ్డాడని పోలీసులు భావించారు. కానీ, దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా నమోదు చేసిన కేసును పోలీసులు హత్య కోణంలో విచారిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం కేతన్‌తో నిశ్చితార్థం అయిన సియా గోయల్‌కు చేతన్ చౌదరి అనే యువకుడితో పరిచయం ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల నిర్ణయంతో కేతన్‌తో పెళ్లికి అంగీకరించిన సియా తమ సంబంధానికి అతడు అడ్డుగా ఉన్నాడని భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేతన్‌ను తొలగించేందుకు ఇద్దరూ కలిసి పథకం రచించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. జూన్ 14న కూడా లోహగడ్ కోట వద్ద కేతన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పాము కనిపించినట్లు భయపెట్టి లోయలోకి నెట్టేయాలనే ప్రయత్నం విఫలమైనట్లు అనుమానిస్తున్నారు. అనంతరం జూన్ 19న సియా పుట్టినరోజు సందర్భంగా మరోసారి కోటకు వెళ్లేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ పేరుతో కేతన్‌ను కోటకు తీసుకెళ్లిన తర్వాత అక్కడకు చేతన్ కూడా చేరుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో కేతన్ సుమారు 350 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో మృతిచెందాడు. ఇది ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

కేసు దిశను మార్చిన అంశం డిజిటల్ ఆధారాలేనని పోలీసులు చెబుతున్నారు. విచారణ సమయంలో సియా కొన్ని విషయాలను దాచిపెట్టినట్లు అనుమానం రావడంతో ఆమె మొబైల్ ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. వాటి ఆధారంగా హత్య కోణంలో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

కేతన్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లికి ముందు ఇద్దరూ బాలీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రయాణానికి ముందు సియా తన పాస్‌పోర్ట్ పోయిందని చెప్పడంతో ట్రిప్ రద్దయింది. అనంతరం ఆమే ఓ హోటల్ వాష్‌రూమ్‌లో పాస్‌పోర్ట్‌ను చింపేసి పడేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అలాగే సియా పుట్టినరోజు వేడుకల కోసం మహాబలేశ్వర్‌లో 40 గదులు బుక్ చేసినట్లు, జైపూర్‌లో ఘనంగా పెళ్లి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఘటన జరిగినప్పుడు ఇది ప్రమాదమని భావించిన పోలీసులు అనంతరం లభించిన ఆధారాల నేపథ్యంలో హత్య కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో తుది నిజాలు కోర్టు విచారణ అనంతరం మాత్రమే వెలుగులోకి రానున్నాయి.
Go Back to Shorts
Ketan Agarwal
Siya Goyal
Lohagad Fort
Pune Businessman Murder
Chetan Chaudhary
Maharashtra Police Investigation

More Telugu News