నాన్న వెంటిలేటర్‌పై ఉన్నారు.. జగన్‌కు పట్టదా?: ముద్రగడ కుమార్తె క్రాంతి ఆవేదన

Mudragada Padmanabham daughter Kranti slams Jagan over fathers health condition
  • హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ 
  • ఆయన కోలుకుంటున్నారని చెబుతున్న‌ కుటుంబ సభ్యులు
  • పరామర్శకు రాలేదంటూ వైఎస్ జగన్‌పై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు
  • తన తండ్రికి క్యాన్సర్ అని, సోదరుడు ఎవరినీ కలవనీయడం లేదన్న‌ క్రాంతి 
  • గతంలో క్యాన్సర్ వార్తలను ఖండించిన ముద్రగడ పద్మనాభం 
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, కుమార్తె క్రాంతి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో ఆయన అభిమానులు, అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఆయన కోలుకుంటున్నారని, వదంతులు నమ్మవద్దని కుటుంబ సభ్యులు చెబుతుండగా, మరోవైపు తన తండ్రి వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతున్నారని కుమార్తె క్రాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్‌ తీరుపై క్రాంతి తీవ్ర అసహనం
తన తండ్రి ఆరోగ్యంపై స్పందించిన క్రాంతి, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "వైసీపీలో రౌడీలకు, గంజాయి బ్యాచ్‌లకు ఇచ్చిన విలువ.. జగన్ కోసం తన పేరును సైతం మార్చుకున్న నా తండ్రికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గత 10 రోజులుగా నాన్న వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతుంటే, కనీసం పరామర్శించడానికి కూడా జగన్‌కు తీరిక లేదా?" అంటూ ఆమె ప్రశ్నించారు. "మీ అవసరం ఉన్నంతవరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత మా నాన్న గారికి మీరు ఇచ్చే విలువ ఇదేనా?" అని నిలదీశారు.

కుటుంబంలో విభేదాలు.. భిన్న వాదనలు
ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రకటనకు, కుమార్తె క్రాంతి చెబుతున్న విషయాలకు పొంతన కుదరడం లేదు. ముద్రగడ అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు పది రోజుల పాటు విశ్రాంతి సూచించారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే క్రాంతి మాత్రం తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయనకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. తన సోదరుడు గిరి, తండ్రిని ఎవరినీ కలవకుండా నిర్బంధించారని ఆమె విమర్శించారు.

గతంలో కూడా క్రాంతి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం స్వయంగా స్పందించారు. తనకు క్యాన్సర్ లేదని, వృద్ధాప్యం కారణంగా వచ్చిన సాధారణ ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని కొందరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని, తనను ఎవరూ నిర్బంధించలేదని అప్పట్లో ఆయన వివరణ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఆయన ఆసుప‌త్రిలో చేరడం, కుటుంబ సభ్యుల మధ్య భిన్న వాదనలు వినిపిస్తుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి నుంచి గత వారం హైదరాబాద్ వచ్చిన ముద్రగడ, నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో ఆసుప‌త్రిలో చేరినట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Mudragada Padmanabham
Mudragada Kranti
YS Jagan Mohan Reddy
Mudragada Padmanabham health update
YSRCP
Kapu leader health news

More Telugu News