టీడీపీ ఆత్మగౌరవ ఉద్యమం, క్యాన్సర్ హాస్పిటల్ మానవతా ఉద్యమం: పెమ్మసాని
- ఎన్టీఆర్ దూరదృష్టికి, చంద్రబాబు కార్యదీక్షకు బసవతారకం ఆసుపత్రి నిదర్శనమని వ్యాఖ్య
- ఆశయాలకు వారసుడిగా నిలిచిన నందమూరి బాలకృష్ణకు ప్రశంసలు
- 100 పడకలతో మొదలై 650 పడకలకు చేరిందన్న పెమ్మసాని
తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఉద్భవించిన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా ప్రజల హృదయాల్లో చెక్కుచెదరని స్థానాన్ని సంపాదించుకుందన్నారు. తన జీవిత భాగస్వామి అనుభవించిన వేదనను మరే పేద కుటుంబం అనుభవించకూడదన్న పట్టుదలతో ఎన్టీఆర్ స్థాపించిన ఈ ఆసుపత్రి, గత 25 ఏళ్లుగా లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తోందని ప్రశంసించారు. క్యాన్సర్ బాధితుల కుటుంబాల్లోని మానసిక వేదనను దూరం చేస్తూ, మధ్యతరగతి ప్రజలకు సైతం అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని చెప్పారు. నాడు ప్రధాన మంత్రి హోదాలో ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేయడం.. ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడులపై ఉన్న అపార గౌరవానికి నిదర్శనమన్నారు.
కేవలం ఆశయం ఉంటే సరిపోదని, దానికి పటిష్ఠమైన ఆచరణ తోడైనప్పుడే అది తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బసవతారకం ఆసుపత్రి విజయవంతంగా రజతోత్సవం జరుపుకుంటున్నా, పరిసర ప్రాంతాల్లో హైటెక్ సిటీ అభివృద్ధి చెందినా, బయోటెక్నాలజీ రంగం వికసించినా, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలు అంతర్జాతీయ గుర్తింపు సాధించినా.. అవి యాదృచ్ఛికంగా లభించిన విజయాలు కావన్నారు. అద్భుతమైన ఆలోచనలకు పదును పెట్టి, నిరంతర పర్యవేక్షణతో వాటిని సాకారం చేసిన అంకిత భావానికి ఇవి సజీవ సాక్ష్యాలని, అటువంటి దార్శనిక నాయకత్వాన్ని అందించిన నారా చంద్రబాబు నాయుడుకు తెలుగు జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
వంద పడకలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి, నేడు 650 పడకల స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులతో పోలిస్తే 40 శాతం తక్కువ వ్యయంతోనే ఇక్కడ అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఆస్తులకు వారసులు ఎందరో ఉంటారు కానీ, ఆశయాలకు వారసులు కొందరే ఉంటారని, తల్లి ఆశయాలను కొనసాగిస్తున్న అరుదైన కుమారుడు నందమూరి బాలకృష్ణ అని ప్రశంసించారు. సేవకు మారుపేరుగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రం, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు.