‘నా మనసు పూర్తిగా విరిగిపోయింది’.. లీకైన రాధా గాయత్రి చివరి ఆడియో!

My heart is completely broken these are the real facts in Radha Gayatri leaked last audio
  • రాధా గాయత్రి భర్త శ్రీచరణ్‌పై సెక్షన్ 103/1 కింద హత్య కేసు నమోదు
  • తనపై అనుమానంతో చెడు ప్రచారం చేస్తున్నాడంటూ తల్లితో గాయత్రి ఆవేదన
  • రాధ తల్లిదండ్రులు అల్లుడిని ప్రశ్నించిన ఆఖరి వీడియో కాల్ దృశ్యాలు వెలుగులోకి 
  • గాయత్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటన.. మృతురాలి తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో హత్య కేసుగా రూపాంతరం చెందింది. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి పోలీసులు రాధా గాయత్రి భర్త శ్రీచరణ్‌పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103/1 కింద హత్య కేసు నమోదు చేశారు. కేసు తీవ్రతను తెలుసుకున్న నిందితుడు శ్రీచరణ్ ఆ రాత్రికి రాత్రే పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గాయత్రి కుటుంబ సభ్యులను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. హోంమంత్రి వంగలపూడి అనితతో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.

రాధా గాయత్రికి సంబంధించిన చివరి ఆడియో రికార్డింగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. భర్త శ్రీచరణ్ ప్రవర్తన, వేధింపులపై గాయత్రి తన తల్లి, అత్తగారితో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. భర్త తనపై అనుమానం పెంచుకుంటూ, తన గురించి అందరి దగ్గరా చెడుగా ప్రచారం చేస్తున్నాడని కన్నీరు పెట్టుకుంది. "అత్తయ్య గారు.. మీ అబ్బాయి ప్రవర్తనతో నా మనసు పూర్తిగా విరిగిపోయింది, ఇన్నాళ్లు చాలా ఓపిక పట్టాను, ఇకపై అతనితో మాట్లాడదలుచుకోలేదు.. ఏమున్నా మా మమ్మీ వాళ్లతోనే మాట్లాడమనండి" అంటూ గాయత్రి ఆవేదన వ్యక్తం చేసిన మాటలు ఆమె పడిన మానసిక క్షోభకు అద్దం పడుతున్నాయి. అలాగే, శ్రీచరణ్‌తో రాధ తల్లిదండ్రులు మాట్లాడిన ఆఖరి వీడియో కాల్ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి.

ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా ఏపీ ప్రభుత్వం ముస్సోరి పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. నిందితుడు ఎక్కడున్నా అరెస్ట్ చేయడం ఖాయమని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముస్సోరి ఎస్‌హెచ్‌‌వో దేవేంద్ర చౌహాన్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందన్న రాధ తండ్రి ఫిర్యాదుతో ఆయనను విచారణ బాధ్యతల నుంచి తప్పిస్తూ  ఉన్నతాధికారులు  ఉత్తర్వులు జారీచేశారు. 
Go Back to Shorts
Radha Gayatri
Sricharan
Mussoorie Murder Case
Visakhapatnam Software Engineer
Leaked Audio Recording
Uttarakhand Police Investigation

More Telugu News