వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు రావాలి: బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల్లో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu calls for more non profit organizations in healthcare sector at Basavatarakam event
  • 25 ఏళ్లుగా బసవతారకం ఆస్పత్రి అందిస్తున్న సేవలు నిరుపమానమన్న ఏపీ సీఎం చంద్రబాబు
  • బసవతారకం ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ సేవలు అన్ స్టాపబుల్ అంటూ వ్యాఖ్య
  • తల్లి పేరుతో బాలయ్య... తండ్రి పేరుతో భువనేశ్వరి చేస్తోన్న సేవా కార్యక్రమాలు అభినందనీయం
వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. సోమవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... “ఒక గొప్ప స్ఫూర్తితో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి అంకురార్పణ జరిగింది. ఈ ఆస్పత్రి ప్రస్థానం వెనుక ఒక బలమైన నేపథ్యం ఉంది. మా అత్తగారికి క్యాన్సర్ సోకిన సమయంలో మెరుగైన చికిత్స కోసం సరైన ఆస్పత్రులు అందుబాటులో లేవు. అప్పట్లో ముంబై, చెన్నై వంటి నగరాల్లోనే క్యాన్సర్ ఆస్పత్రులు ఉండేవి. దురదృష్టవశాత్తూ ఆగస్టు సంక్షోభం సమయంలోనే ఆమె క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. సరైన వైద్యం అందక మరెవరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో ఈ ఆస్పత్రిని నిర్మించాం. ఎన్టీఆర్ దార్శనికతకు తోడు పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ఈ ఆస్పత్రి ఆవిర్భవించింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మేనేజింగ్ ట్రస్టీగా, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వంటి ప్రముఖ వైద్యుల సహకారంతో ఈ ప్రయాణం మొదలైంది. తొలుత 100 పడకలతో ప్రారంభమైన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, నేడు ఒక మహా వృక్షంగా ఎదిగింది. ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది త్యాగాలు దాగి ఉన్నాయి. ఎన్నో సవాళ్లను అధిగమించి నందమూరి బాలకృష్ణ ఈ సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ అందిస్తున్న సేవలు అభినందనీయం. వెండితెరపై ఎవర్ గ్రీన్ హీరోగా, హిందూపురం ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నప్పటికీ, ఆయన క్రమం తప్పకుండా ఆస్పత్రిని సందర్శించి రోగులకు భరోసా కల్పిస్తున్నారు. పూర్తిస్థాయిలో లాభాపేక్ష లేని సంస్థగా బసవతారకం ఆస్పత్రిని నడుపుతున్నారు. ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో ఏపీ, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా ప్రాంతాల క్యాన్సర్ బాధితులకు ఈ ఆస్పత్రి ఆశాదీపంలా నిలుస్తోంది. ఏడాదికి 3 లక్షల మందికి పైగా బాధితులకు చికిత్స అందిస్తూ, రోజుకు సగటున 22 శస్త్రచికిత్సలు చేస్తూ పేదలకు కొండంత అండగా ఉంటోంది. అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి ఏర్పాటుకు ముందుకు వచ్చిన బాలకృష్ణను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. దేశంలోనే అతిపెద్ద లాభాపేక్ష లేని వైద్య సంస్థగా బసవతారకం ఎదగాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.

**ప్రజా సేవకు అంకితమైన కుటుంబం**

“ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రివెంటివ్, క్యూరెటివ్, ప్రిడిక్టివ్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రభుత్వంతో పాటు లాభాపేక్ష లేని ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు వస్తేనే పేదలకు నాణ్యమైన వైద్యం చేరువవుతుంది. బసవతారకం వంటి మరిన్ని స్వచ్ఛంద సంస్థల అవసరం నేడు ఎంతైనా ఉంది. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ఆయన స్థాపించిన పార్టీ ద్వారా మేము రాజకీయంగా కృషి చేస్తుంటే, ఆయన కుమారుడు బాలకృష్ణ, కుమార్తె భువనేశ్వరి తమ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో నిలుస్తున్నారు. తల్లి పేరుతో బాలయ్య బసవతారకం ఆస్పత్రిని నడుపుతుంటే, భువనేశ్వరి తన తండ్రి పేరిట ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్య సేవలు అందిస్తూ తలసేమియా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ప్రజల కోసం ఈ స్థాయిలో కృషి చేస్తున్న కుటుంబం మరొకటి ఉండదు. పేదలకు సేవ చేయడంలో ఉండే తృప్తి వెలకట్టలేనిది. బాలకృష్ణ, భువనేశ్వరి చేస్తున్న సేవా కార్యక్రమాలు నిజంగా అభినందనీయం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అనుప్రియా పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ, తెలంగాణ వైద్యారోగ్య శాఖల మంత్రులు సత్యకుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, భరత్, ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.                                
Go Back to Shorts
Chandrababu Naidu
Basavatarakam Cancer Hospital
Nandamuri Balakrishna
Silver Jubilee Celebrations
Andhra Pradesh Healthcare
Non profit organizations

More Telugu News