ఖతార్ గ్యాస్ ప్లాంట్ పేలుడులో 12 మంది భారతీయుల సజీవ దహనం
- బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో ఆదివారం రాత్రి భారీ పేలుడు
- మృతి చెందిన 13 మందిలో 12 మంది భారతీయులే
- మరో 66 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
- మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు భారత రాయబార కార్యాలయం చర్యలు
ఈ ఘోర ప్రమాదంపై ఖతార్ ఇంధన శాఖ సహాయ మంత్రి, 'ఖతార్ ఎనర్జీ' సీఈవో సాద్ అల్-కాబీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతంలో ఇరాన్ క్షిపణి దాడి కారణంగా ఈ ప్లాంట్ కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో, మరమ్మతుల అనంతరం ప్లాంట్‌ను పునఃప్రారంభించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది ఎలాంటి విద్రోహ చర్య లేదా శత్రుదేశాల దాడి కాదని, కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ పేలుడు వల్ల ఖతార్ అంతర్జాతీయ ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తికి గానీ, ఎగుమతులకు గానీ ఎలాంటి ఆటంకం కలగలేదని, పర్యావరణ ముప్పు కూడా లేదని ప్రకటించారు.
మరోవైపు దోహాలోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై తక్షణమే స్పందించింది. మరణించిన 12 మంది భారతీయుల వివరాలను సేకరించి, వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. గాయపడిన భారతీయ కార్మికులందరికీ స్థానిక ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందుతోందని, ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉందని రాయబార కార్యాలయం ఎక్స్ ద్వారా వెల్లడించింది. బాధిత కుటుంబాలకు అవసరమైన చట్టపరమైన సాయం అందించడంతో పాటు, మృతుల భౌతిక కాయాలను వీలైనంత త్వరగా భారతదేశానికి తరలించేందుకు ఖతార్ ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.