కార్యకర్తలపై ఖర్గే ఫైర్.. 'పనికిమాలిన వాళ్లు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు

Mallikarjun Kharge fires at party workers calling them useless people
  • 'డీకే డీకే' నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆగ్రహం
  • 'పనికిమాలిన వాళ్లు' అంటూ మండిపాటు.. క్రమశిక్షణా చర్యలు తప్పవని వార్నింగ్‌
  • ఇది పార్టీ కార్యక్రమం, వ్యక్తిగత భజన కోసం కాదన్న‌ ఖర్గే
  • స్వయంగా జోక్యం చేసుకుని కార్యకర్తలను శాంతపరిచిన సీఎం డీకే శివకుమార్ 
  • కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే వర్గాల మధ్య పోరు నేపథ్యంలో ఈ ఘటన
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతుగా కొందరు కార్యకర్తలు 'డీకే డీకే' అంటూ నినాదాలు చేయడంతో ఆయన సహనం కోల్పోయారు. 'పనికిమాలిన వాళ్లు' అంటూ వారిపై మండిపడ్డారు. కర్ణాటక పీసీసీ నూతన అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న వేదికపై ఈ ఘటన చోటుచేసుకుంది.

కార్యకర్తలు నినాదాలు ఆపకపోవడంతో ఖర్గే తీవ్ర స్వరంతో మాట్లాడారు. "నోరుమూయండి! కింద కూర్చోండి. దేశమంతా మీ చేతుల్లోకి వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశం. ఎవరో ఒక వ్యక్తి కోసం ఏర్పాటు చేసింది కాదు. పార్టీని బలోపేతం చేయడానికి, ఐక్యంగా ఉంచడానికి అందరం ఇక్కడకు వచ్చాం. ఒకరు ఒకరి పేరు, మరొకరు ఇంకొకరి పేరు అరుస్తుంటే.. మిగిలిన వాళ్లు ఇక్కడ చెత్త ఊడ్చడానికి వచ్చారా?" అని గట్టిగా అరిచారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్వయంగా లేచి నిలబడి, కార్యకర్తలను శాంతించాలని సైగలు చేయడం గమనార్హం.

అంతటితో ఆగకుండా పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరమని ఖర్గే స్పష్టం చేశారు. "ఇక్కడ ఎవరు అల్లరి చేస్తున్నారో వీడియో ఫుటేజ్‌లో రికార్డ్ అవుతోంది. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత కచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాను. ఎవర్నీ వదిలిపెట్టను" అని తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ వల్లే మనందరికీ గుర్తింపు అని, వ్యక్తిగత నినాదాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని సూచించారు.

కర్ణాటక కాంగ్రెస్‌లో కొంతకాలంగా నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ నడిచింది. అధిష్ఠానం జోక్యంతో సిద్ధరామయ్య సీఎం కాగా, డీకే ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. రెండేళ్ల తర్వాత సీఎం మార్పు ఉంటుందనే ఒప్పందం కుదిరినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేయగానే డీకే వర్గం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచింది. దీంతో రానున్న 2028 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం నాయకత్వ మార్పునకు అంగీకరించింది. ఈ క్రమంలోనే గత మే 28న సిద్ధరామయ్య రాజీనామా చేయగా, వారం రోజుల తర్వాత డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాజా ఘటన పార్టీలోని వర్గపోరును మరోసారి బహిర్గతం చేసింది.
Go Back to Shorts
Mallikarjun Kharge
DK Shivakumar
Karnataka Congress
Congress party workers
BK Hariprasad
Siddaramaiah

More Telugu News