యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- యోగతోనే తనకు లోతైన స్పష్టత, పరిపక్వత లభించాయని చెప్పిన పవన్ కల్యాణ్
- తన దినచర్యలో క్రియ యోగ, అష్టాంగ యోగ అంతర్భాగమని వెల్లడి
- యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
"భారత నాగరికతలో యోగా ఒక అంతర్భాగం. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతమైన బహుమతి ఇది. శారీరక ఆరోగ్యం, మానసిక స్పష్టత, అంతర్గత సమతుల్యతను యోగా ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలి" అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
చిన్న వయసులోనే తాను యోగా ప్రయాణం ప్రారంభించానని ఆయన గుర్తుచేసుకున్నారు. "నా మదిలో ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతున్న సమయంలో, యోగా నాకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, ప్రగాఢమైన స్పష్టతను, పరిపక్వతను ఇచ్చింది. నా ప్రయాణానికి సరైన మార్గాన్ని చూపింది. క్రియ యోగ, అష్టాంగ యోగ, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన సుదర్శన క్రియ వంటివి ఇప్పటికీ నా దినచర్యలో అంతర్భాగంగా కొనసాగుతున్నాయి" అని ఆయన వివరించారు.
యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషిని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలన్న మోదీ చొరవకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖలో ఘనంగా యోగా వేడుకలు
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్నంలోని సాగరిక ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వి. అనిత పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆమె యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ జి.పి. రాజశేఖర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర సంఘాల సభ్యులు, సాధారణ పౌరులు, యువత ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.