హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!

CM Chandrababu and Lokesh perform Yoga for a Healthy Andhra Pradesh along with Baba Ramdev
  • నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం 
  • బాబా రామ్‌దేవ్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ యోగాభ్యాసం 
  • రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాలలో కోటి మందికి పైగా యోగా సాధన 
  • రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని సీఎం ప్రకటన 
  • ఆగస్టు 15 నుంచి 'సంజీవని' ప్రాజెక్ట్ అమలు
  • స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాల నిర్మాణం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన యోగా వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి సామూహిక యోగాభ్యాసంలో పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో బాబా రామ్‌దేవ్‌తో కలిసి యోగా చేయడం ఎన్నటికీ మరువలేని అనుభూతిని ఇచ్చిందని ఈ సందర్భంగా సీఎం హర్షం వ్యక్తం చేశారు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన గుర్తింపు తెచ్చి, నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించేలా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మోదీ తన చొరవతో ప్రపంచానికి భారతదేశ శక్తులను చాటుతూ, దేశాన్ని అగ్రభాగాన నిలబెడుతున్నారని కొనియాడారు. సాంకేతికత, ఆధ్యాత్మికతల కలయికతోనే సమాజ భవిష్యత్తు ముడిపడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

   
ఆధ్యాత్మికత, యోగా సాధన ద్వారానే హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ (సుఖీభవ ఏపీ) సాధ్యమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో విశాఖపట్నంలో 'యోగాంధ్ర-2025' పేరిట భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రధాని మోదీ సమక్షంలో గిన్నిస్ బుక్, ప్రపంచ రికార్డులను సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా వేడుకలను పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
     
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాలలో కోటి మందికి పైగా ప్రజలు యోగా సాధన చేస్తున్నారని, ఈ సంస్కృతిని ఇంటింటికీ చేర్చి ప్రజారోగ్యాన్ని కాపాడటమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో బాబా రామ్‌దేవ్ చేసిన అమోఘమైన కృషిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. 
   
రాష్ట్రంలో యోగా కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తామని, స్టాండర్డ్ యోగా ప్రొటోకాల్స్ రూపొందించడానికి ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఇందుకోసం 'యోగాంధ్ర' పేరిట ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ను కూడా తీసుకురానున్నారు. అలాగే, రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
 
ప్రజలు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌లను పూర్తిగా దూరంగా పెట్టాలని, రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా అనారోగ్యాలను దరిచేరనివ్వకుండా చూసుకోవచ్చని హితవు పలికారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని (గ్రీన్ కవర్) 50 శాతానికి పెంచుతామని చెబుతూ.. రాబోయే ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వైద్య నిపుణులను ప్రజలకు చేరువ చేయడంతో పాటు యోగాను కూడా అందులో భాగం చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గంట పాటు యోగా, ధ్యానం, ప్రాణాయామంకు కేటాయిస్తే అసలు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరమే రాదని చంద్రబాబు పేర్కొన్నారు.
అనంతరం వ్యసన ముక్త భారత ప్రచార యాత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగర వాసులు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమానికి హాజరయ్యారు.
                                 
Go Back to Shorts
Chandrababu Naidu
Nara Lokesh
Baba Ramdev
International Yoga Day
Healthy Andhra Pradesh
Yogandhra Portal

More Telugu News